ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి అస్వస్థత!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్య పేటలో వివిధ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆమె పలు మార్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. మంత్రి విడదల రజిని జగ్గయ్య పేటలో ప్రారంభించాల్సిన పలు కార్యక్రమాల కోసం సోమవారం రాత్రి జగ్గయ్యపేటలోని తన బంధువు ఇంటికి వచ్చారు. స్థానిక ఎస్‌జీఎస్‌ కళాశాల ఏవో కే.సత్యనారాయణ రావు ఇంటికి వెళ్లారు. అనంతరం 2 టౌన్‌ హెల్త్‌ సెంటర్‌లు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, పలు విభాగాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రద్దీ కారణంగా ఆమె అసౌకర్యానికి గురయ్యారు. తర్వాత జరిగిన సభలో కూడా ఆమె ముక్తసరిగా మాట్లాడారు. ఎక్కువ సేపు మాట్లాడలేని పరిస్థితిలో తొందరగానే ప్రసంగాన్ని ముగించారు. ఆమె ఇబ్బంది పడడటం గుర్తించిన ఎన్టీఆర్‌ జిల్లా వైద్యాధికారిణి సుహాసిని ఆమెకు ఓఆర్‌ఎస్‌ ఇచ్చారు. అప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో కార్యక్రమం మధ్యలోనే ఆమె అక్కడినుంచి బంధువు వెళ్లిపోయారు. అక్కడ ఇంటి దగ్గర డాక్టర్‌ సౌజన్య ఆమెకు సెలైన్‌ ఎక్కించారు.

నీరసం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. విడదల రజిని అనారోగ్యం గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమెను పరామర్శించారు. మరికొంత మంది ఫోన్‌ ద్వారా ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, విడదల రజిని 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీనుంచి ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు. 2022లో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Show comments