Dharani
Dharani
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు సీఎం జగన్ మోహన్‌రెడ్డి. అర్హులైనవారందరికి ఆర్థిక సాయం అందజేస్తూ.. వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు అన్ని వర్గాల వారి కోసం రకరకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సాయం అందజేస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో తాజాగా నేడు మరోక పథకానికి సంబంధించిన నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్. సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం నిధులు విడుదల చేయనున్నారు.
ఇవాళ విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ వాహన మిత్ర పథకం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. బటన్ నొక్కి నేరుగా.. లబ్ధిదారుల ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. 2023–24 సంవత్సరానికి గాను సుమారు 2,75,931 మంది లబ్ధిదారులకు.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు సీఎం జగన్. నేడు అందించే మొత్తంతో కలిపి వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది.
ఈ పథకానికి అర్హులు కావాలంటే.. సొంతంగా ఆటో రిక్షా లేదా టాక్సీ, టాక్సీ క్యాబ్ ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, బీపీఎల్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తు దారడి పేరు మీదనే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఉండాలి. అయితే కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ వేరే రాష్ట్రంలో వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నట్లైతే.. వాళ్లు అడ్రస్‌ను ఆంధ్రప్రదేశ్‌కి మార్చుకుంటేనే ఈ పథకానికి అర్హులు అవుతారు. అంతేకాదు 18 ఏళ్లకు పై బడిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు ఎవరూ ఉండకూడదు.