iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డు దారులకు AP సర్కార్ గుడ్ న్యూస్! ఇక ఆ ఇబ్బంది ఉండదు..

రేషన్ కార్డు దారులకు AP సర్కార్ గుడ్ న్యూస్! ఇక ఆ ఇబ్బంది ఉండదు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంది. గతంలో రాగులు, గోధుమలు, ఇతర వస్తువులు పంపిణీ చేసింది. అలానే రేషన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం తరచూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా కూడా ఏపీలోని రేషన్ లబ్ధిదారులకు జగన్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ తీసుకునే సమయంలో సర్వర్ మొరాయించే సంగతి అందరికి తెలిసిందే. ఆ  సమస్యకు చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. సర్వర్ సమస్యకు ప్రత్యామ్నాయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వర్‌ సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ రేషన్‌ కార్డుదారులకు ఆఫ్‌లైన్‌లో సరకులు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నెల ఒకటి నుంచి  రేషన్ పంపిణీ ప్రారంభమైంది. నాలుగు రోజులు ప్రక్రియ సాఫీగానే సాగింది. ఐదు రోజు మాత్రం సర్వర్ మొరాయించింది. సర్వర్‌లో సమస్య తలెత్తడంతో సరకులు ఎప్పుడొస్తాయో తెలియక లబ్ధిదారులు ఆందోళ గురయ్యారు. ప్రతిరోజు ఎండీయూ వాహనాలు గ్రామాలకు వచ్చి.. సర్వర్ పని చేయకపోవడంతో వెనక్కు వెళుతున్నాయి. రోజులో కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఇదే పరిస్థితి తలెత్తుతోంది. కొన్ని సందర్భాల్లో వేలిముద్రలు పడకపోవడం.. మరికొన్నిసార్లు యంత్రాలు మొరాయించడం వంటి సమస్యలు ఉన్నాయి. దీంతో రేషన్ కార్డుదారులు గంటల కొద్దీ మొబైల్‌ వాహనాల దగ్గర పడిగాపులు ఉండాల్సి వచ్చింది. రేషన్ కార్డుదారుల నుంచి  ఫిర్యాదులు రావడంతో ఎండీయూ ఆపరేటర్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సర్వర్ సమస్యను పరిస్థితి చక్కదిద్దకపోతే రేషన్ సరకులు పంపిణీ చేయలేమని అధికారులకు తెలిపారు. దీంతో  సర్వర్‌ పనిచేసేంత వరకు ఆఫ్‌లైన్‌ లో  అంటే వేలిముద్రలు అవసరం లేకుండా కార్డు నంబర్‌ నమోదు చేసుకుని సరకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల అధికారులు ఆదేశించారు. అయితే పోర్టబులిటీ కార్డులకు మాత్రం సరకులు ఇవ్వరు.. అంటే ఇతర ప్రాంతాల్లో కార్డులు కలిగిన వారికి మాత్రం ఇవ్వరు. గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు సర్వర్లు పనిచేయకుండా ఉండలేదన్నారు. అమరావతి సర్వర్‌లో సమస్యల వల్లనే సమస్యలు వచ్చాయంటున్నారు. ఇక ఆఫ్ లైన్  విధానంలో రేషన్ సరకులు పంపిణీ చేయడంతో సర్వర్ సమస్య నుంచి లబ్ధిదారులకు ఉపశమనం లభించినట్లు అయింది. మరి.. రేషన్ పంపిణీ విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.