iDreamPost
android-app
ios-app

Tesla: ఆంధ్రప్రదేశ్ కి టెస్లా.. ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న ప్రభుత్వం..!

  • Published Apr 12, 2024 | 2:29 PM Updated Updated Apr 12, 2024 | 2:29 PM

రాష్ట్రంలో టెస్లా మ్యాన్యుఫ్యాక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే మస్క్ ఇండియా రానుండటంతో.. దీనిపై చర్చించనున్నారు. ఆ వివరాలు..

రాష్ట్రంలో టెస్లా మ్యాన్యుఫ్యాక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే మస్క్ ఇండియా రానుండటంతో.. దీనిపై చర్చించనున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 12, 2024 | 2:29 PMUpdated Apr 12, 2024 | 2:29 PM
Tesla: ఆంధ్రప్రదేశ్ కి టెస్లా.. ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న ప్రభుత్వం..!

అమెరికాలోని దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. ఇండియాలో తన మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ ప్రారంభించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దాంతో భారత్‌లోకి టెస్లా కార్లు వస్తాయని గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ కి టెస్లా రాబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీలో తన మ్యాన్యుఫ్యాక్చర్‌ యూనిట్‌ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపామని.. యూనిట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలనకు రావాలని టెస్లా బృందాన్ని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా తమ ప్రభుత్వం పూర్తి సహాకారం అందించనుందని వెల్లడించింది.

అంతేకాక టెస్లా ప్లాంట్ కోసం.. చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్‌ సమీపంలో భూములను ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీ సిటీ సమీపంలో భూములు పరిశీలించవచ్చు అని అధికారులు టెస్లా యాజమాన్యానికి తెలిపినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసుకొచ్చింది.

వాస్తవానికి ఏపీ సర్కార్ 2021, 2022 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో టెస్లా ప్లాంటు ఏర్పాటు చేయాలని టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ను ఆహ్వానించింది. త్వరలోనే మస్క్ భారతదేశానికి రాబోతుండటంతో.. ఎలాగైనా సరే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెస్లా బృందాలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తాయని సదరు అధికారి చెప్పుకొచ్చారు. మస్క్ ప్రధానిని కలుస్తున్నప్పటికీ ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్చల ఫలితం బయటకు రాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.ప్లాంట్ నిర్మాణానికి 2,500 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. ఆ మేరకు భూమి కేటాయింపుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.