AP Government: ఏపీ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త!

దేశంలో యువతరం పెరుగుతోంది. లక్ష్యాలు, గమ్యాల కోసం ముందుకు సాగుతున్నారు. కొంత మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడుతుండగా.. మరికొంత మంది ప్రభుత్వ కొలువు కొట్టాలని లక్ష్యంగా తీసుకుని, ఆ దిశగా పయనం సాగిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే ఆశావాహులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తో పాటు పలు బోర్డుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపడుతూ వస్తోంది. గతంలో కూడా గరిష్ట వయో పరిమితిని పెంచిన ఏపీ సర్కార్.. ఇప్పుడు మరోసారి ఆ పరిమితిని పెంచి ఉద్యోగార్ధులు ఆశలను సజీవం చేస్తోంది. ఇందులో యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితి ఉంది.

తాజాగా యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆశావాహులకు గరిష్ట వయో పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికి రెండేళ్లు అదనంగా పెంచింది. ఇప్పుడు నాన్ యూనిఫామ్ అభ్యర్థులకు జనరల్ కేటగిరిలో 34 ఏళ్ల గరిష్ట వయస్సును 42 ఏళ్లకు పొడిగించింది.  ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు రిజర్వ్ కేటగిరీలకు ఉండే అదనపు వయోపరిమితి కూడా వర్తిస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ నిర్వహించే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నిబంధనలు వర్తిస్తాయి. త్వరలో గ్రూప్1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కూడా నోటీఫికేషన్ విడుదల చేయనుంది. గరిష్ట వయోపరిమితిని పెంచడం ద్వారా రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నిరుద్యోగులకు లాభం చేకూరనుంది.

Show comments