iDreamPost
android-app
ios-app

APలో వారికి అలర్ట్.. పింఛన్ కావాలంటే ఈ పత్రాలు ఉండాల్సిందే

  • Published Mar 31, 2024 | 6:38 PM Updated Updated Mar 31, 2024 | 6:38 PM

AP Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

AP Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Mar 31, 2024 | 6:38 PMUpdated Mar 31, 2024 | 6:38 PM
APలో వారికి అలర్ట్.. పింఛన్ కావాలంటే ఈ పత్రాలు ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ మరీ ముఖ్యంగా పింఛన్లపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మార్చి నెల వరకు కూడా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీపై సందేహాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఎన్నికల కమిషన్ సైతం వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ నెల పింఛన్ పంపిణీపై గందరగోళం నెలకొని ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మూడో తేదీ నుంచి సచివాలయాల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ నాలుగో తేదీన ఫలితాలు రానున్నాయి. ఫలితాలు వచ్చే వరకూ అనగా జూన్ వరకు మూడు నెలల పాటు ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇంటి వద్ధకే పింఛన్ల పంపిణీ ఉండదు. వచ్చే మూడు నెలలు సచివాలయాల వద్దకు వెళ్లి లబ్దిదారులు పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుందంటూ సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోనే సచివాలయాల్లోనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పింఛను లబ్ధిదారులు ఆధార్‌ లేదా ఇతర గుర్తింపు కార్డు తమ వెంట తీసుకెళ్లాలని సెర్ప్‌ సూచించింది. ఇక పింఛన్ తీసుకునే లబ్ధిదారులు తమ వెంట పింఛన్ పాస్ బుక్ తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. అందులో సీఎం జగన్ ఫోటో ఉంటుందని.. అది ఎన్నికల కోడ్ కు విరుద్ధమని తెలిపారు.

అలాగే పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో సచివాలయం వద్దకు వస్తుంటారు. వేసవి నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పింఛన్ అందించే పంచాయతీ కార్యదర్శి లేదా వెల్ఫేర్ అసిస్టెంట్‌లకు ఆథరైజేషన్ లెటర్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.