ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తనదైన పాలనతో ముందుకెళ్తున్నారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం నిరంతరం కృషి చేస్తున్నారు. వివిథ రకాల పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఉద్యోగుల నుంచి సామాన్య జనం వరకు ప్రతి ఒక్కరికి సీఎం మేలు చేస్తూ.. వారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తరచూ ఏదో ఒక విషయంతో జగన్ సర్కార్ ప్రజలకు శుభవార్తలు చెప్తూనే ఉంటుంది. తాజాగా అర్చకులకు కూడా జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్చకులకు రూ.10 వేల జీతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏపీ వ్యాప్తంగా రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు రూ.10 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు తెలిపారు.ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకన్నామని మంత్రి తెలిపారు. ఇక అర్చకుల జీతాలతో పాటు ఆలయాల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును కూడా 62 పెంచాలని నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి నేడు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న 2,625 మంది అర్చకులకు పెంచిన వేతనాలను వచ్చే నెల నుంచే అందిస్తామని మంత్రి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి కేటగిరిలో ఉన్న దేవస్థానాల్లో పని చేసే అర్చకులకు గౌరవ వేతనం రూ.15,625, రెండవ కేటగిరిలో అర్చకులకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తూ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా అర్చకులకు వైద్య ఖర్చులను కూడా పూర్తిగా భరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రూ.10 వేల లోపు గౌరవ వేతనం ఉన్న అర్చకులకు.. రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో దేవాలయాల్లో సాంకేతిక సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని గురించి కూడా ప్రస్తావించారు త్వరలో దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. అదే విధంగా ఆలయ భూముల ఆక్రమణదారులకు 8 ఏళ్లకు మించి శిక్ష పడేలా చట్టాన్ని మార్చామన్నారు. సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. అర్చకుల వేతనాల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.