iDreamPost
android-app
ios-app

ఉద్యోగుల ఇళ్ళ స్థలాలపై CS జవహర్ రెడ్డి సమీక్ష!

ఉద్యోగుల ఇళ్ళ స్థలాలపై CS జవహర్ రెడ్డి సమీక్ష!

పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానంపై పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ఎంత మేర భూమి అవసరం ఉందో.. పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సాయి ప్రసాద్ కు సీఎస్ సూచించారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ తెలిపారు.

పట్టణాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివసించే వారిని కట్టడి చేయచ్చన్నారు. వారిని పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్లలో నివసించేలా చేయొచ్చని తెలిపారు. అలా చేస్తే పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వచ్చని సీఎస్ పేర్కొన్నారు. ఈ విధానంపై అన్ని సిటీల్లో పరిశీలన చేసి ముఖ్యమంత్రి సమావేశం నాటికి నివేదికను సిద్ధం చేయాలని జవహర్ రెడ్డి రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.

సీఎస్ జవహర్ రెడ్డి అటు వైద్యారోగ్య శాఖపై కూడా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని మరింత పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై వచ్చిన పలు డిమాండ్ల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడారు.

“ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనల అమలుకు చర్యలు తీసుకున్నాం. మరికొన్ని ప్రతి పాదనలపై రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గ్రామ- వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకున్నాం” అంటూ కృష్ణబాబు వెల్లడించారు. అదే విధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాదికి పొడిగించినట్లు సీఎస్ జవహర్ రెడ్డికి వివరించారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరుకు అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కృష్ణబాబు చెప్పారు. రాష్ట్రంలోని 53 ఏరియా ఆసుపత్రుల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్స్ అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.