Dharani
CM Jagan London Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ టూర్ వేళ కలకలం చెలరేగింది. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..
CM Jagan London Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ టూర్ వేళ కలకలం చెలరేగింది. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. లండన్ పర్యటన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో గన్నవరం విమానాశ్రయంలో అనూహ్య సంఘటన వెలుగు చూసింది. జగన్ పర్యటన వేళ ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటన గురించి అతడు మెసేజ్‌లు పంపినట్లు గుర్తించారు. దీనిపై ప్రశ్నించగా.. అతడు తనకు గుండెపోటు వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నాడు. కోలుకోగానే విచారిస్తామని పోలీసులు తెలిపారు.
ఇక సదరు వ్యక్తిని గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్‌గా గుర్తించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో పోలీసులకు లోకేష్ మీద అనుమానం వచ్చింది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వివరాలు గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో లోకేష్‌ను పోలీసులు ప్రశ్నించగా.. తనకు గుండెపోటు వచ్చిందని తెలిపాడు. అక్కడే పడిపోవడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయతే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్ లోకేష్ మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. లోకేష్ కోలుకోగానే పోలీసులు ప్రశ్నించనున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్ అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. ఆయన డాక్టర్‌గా సేవలు అందించి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. అలాగే లోకేష్‌కు అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లు కూడా గుర్తించారు. లోకేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్‌లను ఎవరికో పంపినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.
ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్‌కు సంబంధం ఏంటి.. జగన్ లండన్ వెళ్లే సమయంలోనే అతడు ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు.. ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను లోకేష్ ఎవరికి పెట్టాడు.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఏపీలో మే 13న పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఈలోపల నాయకులు ఫ్యామిలీతో టూర్లకు వెళ్తూ చిల్లవుతున్నారు. దీనిలో భాగంగానే జగన్ కూడా వెకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.