రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే వాతావరణం మాత్రం భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండలు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక కొన్ని జిల్లాల్లో అయితే మధ్యాహ్నం వరకు ఎండలు కొట్టి.. ఆ తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇటు ఏపీలో అటు తెలంగాణలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ వాతావరణ శాఖ వర్షాల గురించి అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరిచ్చింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటమే కాకుండా.. ఉపరితల ద్రోణి కూడా వ్యాపించడంతో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కర్నూలు, నంద్యాల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాలకు చెందిన రైతులు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. గతవారం రాష్ట్రంలో వానలు పడితే.. ఈ వారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ విచిత్ర వాతావరణంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో మంచిర్యాల, అదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు (04-10-2023) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
~ఏపీ విపత్తుల సంస్థ#rains #AndhraPradesh #rainalertap pic.twitter.com/33LyCOyDpJ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 3, 2023