iDreamPost
android-app
ios-app

మత్స్యకారుల కోసం కొత్త టెక్నాలజీ.. అందుబాటులోకి తెస్తున్న జగన్ సర్కారు!

  • Author singhj Published - 09:34 AM, Wed - 16 August 23
  • Author singhj Published - 09:34 AM, Wed - 16 August 23
మత్స్యకారుల కోసం కొత్త టెక్నాలజీ.. అందుబాటులోకి తెస్తున్న జగన్ సర్కారు!

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆపదలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువ. వేటాడేందుకు వెళ్లిన గంగపుత్రులు తప్పిపోయిన ఘటనలు, ప్రమాదానికి గురవడం గురించి కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వారి కోసం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది జగన్ సర్కారు. ఇస్రో డెవలప్ చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్​ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సముద్ర జలాల్లో వేటపై ఆధారపడి రాష్ట్రంలో 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి.

వేట సాగించే మత్స్యకారులకు ఇప్పటిదాకా ఇన్​కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద అధికంగా ఉండే ప్రదేశాలను గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్​ఫర్మేషన్ సిస్టమ్, మత్స్యశాఖ డెవలప్ చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ సమాచారం సంప్రదాయ, మెకనైజ్డ్ బోట్లకు అందే ఛాన్స్ లేదు. పైగా ఇది రెండు నుంచి మూడ్రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరోవైపు ఎవరైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం చెప్పాలంటే.. అది ఫోన్లకు ఉండే సిగ్నల్స్​ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సిగ్నల్ మిస్సయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. దీంతో ఈ పరిస్థితికి చెక్ పెడుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.

కొత్తగా ప్రవేశపెడుతున్న కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్​ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చనున్నారు. రూ.36,400 విలువైన ఈ డివైజ్​ను 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం డెవలప్ చేసిన నావిక్, జీపీఎస్​ శాటిలైట్స్​తో ఈ పరికరం అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల దగ్గర ఉండే ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే సిగ్నల్​తో సంబంధం లేకుండా ఇరువైపులా సమాచారాన్ని పరస్పరం పంపుకునే ఛాన్స్ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్​వేర్​ అప్లికేషన్​ను అభివృద్ధి చేస్తున్నారు. ఎవరైనా సముద్రంలో ఆపదలో చిక్కుకుంటే ఈ డివైజ్ ద్వారా ఇన్​ఫర్మేషన్ పంపితే శాటిలైట్ ద్వారా వెంటనే గ్రౌండ్ స్టేషన్​కు చేరుతుంది. అక్టోబర్ నాటికి ఈ డివైజ్ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామని మత్స్య శాఖ జేడీ వీవీ రావు తెలిపారు.