Rain Update: వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడ్డ అ‍ల్పపీడనం కారణంగా మరో రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఏపీకి సంబంధించి అమరావతి వాతావరణ శాఖ  వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అ‍ల్పపీడనం రాబోయే రెండు, మూడు రోజులు ఒడిశా, ఛత్తీష్‌ఘడ్‌ల వైపు పయనిస్తుందని, దాని కారణంగా మూడు రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో చెదురుమొదురు వర్షాలు పడతాయని ప్రకటించింది. తెలంగాణ విషయానికి వస్తే.. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

నిజామాబాద్‌, జిగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, మరోసారి వర్షాలు పడుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఉన్నతాధికారులు వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments