ప్రపంచంలో ఎక్కువమంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి ఒకటి. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి.. శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక తిరుమల కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు.. భక్తులు వివిధ మార్గాల్లో వస్తుంటారు. సాధారణంగా తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు నడక మార్గం, టాక్సీలు ,జీపులు, బస్సులో వెళ్తుంటారు. చాలా మంది భక్తులు నడక దారిని తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మందికి రెండు నడక మార్గాలే తెలుసు. అందులో ఒకటి అలిపిరి, రెండవది శ్రీవారి మెట్లు. కానీ చాలా తక్కువ మంది కి మాత్రమే తెలుసు.. ఈ రెండు మార్గాలు కాకుండా ఇంకొన్ని నడకమార్గాలు కూడా ఉన్నాయని. మరి.. మొత్తం ఎన్ని నడక మార్గాలు ఉన్నాయి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడుతెలుసుకుందాం..
తిరుమలకు ఏడు కొండలు ఉన్నాయనే సంగతి అందరికి తెలుసు. ఈ ఏడు కొండల గుండా నడక దారిలో ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. అలిపిరి నుంచి తిరుమలకు కొండ ఎక్కిన తొలి భక్తుడు అన్నమాచార్యులే. అలిపిరి నుంచి అన్నమాచార్యులు వెళ్లిన దారే తొలినాళ్ల నుంచి గుర్తింపు పొందింది. శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి తక్కువ సమయం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ మార్గమే కాకుండా తిరుమలకు చేరుకునేందు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఆ మార్గాల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే.
శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది అతిప్రధానమైనది అలిపిరి.
తిరుపతి కి 10కిలో మీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా 3కి.మీ నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. చంద్రగిరి కోట నిర్మించిన తరువాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
ఇక తిరుమలకు వెళ్లే వాటిల్లో మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్య దిక్కున కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల సౌకర్యార్థం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.
తిరుమల కొండకు పశ్చిమం దిక్కున కల్యాణి డ్యామ్ ఉంది. దానికి ఆనుకొని శ్యామలకోన ప్రాంతంనుంచి తిరుమలకు దారి ఉంది.
కల్యాణ్ డ్యామ్ వద్ద నుండి దారి గుండా 3 కి.మీ ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది.
కడప సరిహద్దులో చిత్తూరు ప్రారంభంలో కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం ,పాపవినాశనం మీదుగా తిరుమల చేరుకోవచ్చు.
ఇక అన్నిటిలో ఏడో దారి అవ్వాచారికోన. ఈ దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.
ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి కాబట్టి ఆ పేరు వచ్చింది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.
తలకోన నుంచి కూడా తిరుమలకు చేరుకోవచ్చు. తనకోన జలపాతం వద్ద నుంచి జెండాపేటు దారిలోకి వస్తే … మీరు తిరుమలకు చేరుకున్నట్లే. మరి.. తిరుమలక నడక దారులకు గురించి తెలిపిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.