iDreamPost

అనుమానాలు పటాపంచలు చేసిన కేసీఆర్‌

అనుమానాలు పటాపంచలు చేసిన కేసీఆర్‌

హుజురాబాద్‌ ఉప ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన పథకం దళితబంధు. తన మాజీ సహచరుడు అయిన ఈటెల రాజేందర్‌ను ఓడించేందుకు హుజురాబాద్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ శాయశక్తులా పనిచేశారు. అభివృద్ధి పనులు, రాజకీయ నేతలకు పనులే కాదు.. దళిత బంధు పథకం కూడా తీసుకొచ్చారు. ఉప ఎన్నికల వేళ వచ్చిన ఈ పథకం.. ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కనుమరుగు అవుతుందనే విశ్లేషణలు సాగాయి. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీల సరసన దళిత బంధు కూడా నిలుస్తుందని అంచనా వేశారు.

అయితే దళిత బంధు పథకాన్ని కేసీఆర్‌ సీరియస్‌గానే తీసుకున్నట్లు బడ్జెట్‌ రోజున స్పష్టమైంది. బడ్జెట్‌లో దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు వెచ్చించారు. హుజురాబాద్‌లో ఇప్పటికే అమలుకావడంతో.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సిద్ధమైంది. హుజురాబాద్‌ పోను.. మిగిలిన 118 నియోజకవర్గాల్లోనూ ఈ పథకం అమలుకానుంది. తొలి విడతలో నియోజకవర్గానికి వందమంది చొప్పన అర్హులను ఎంపిక చేసి.. దళిత బంధును అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత విడతల వారీగా అర్హులైన వారికి పథకాన్ని వర్తింపజేయాలనే ప్రణాళికతో కేసీఆర్‌ సర్కార్‌ ఉన్నట్లు అర్థమవుతోంది.

పథకం ప్రకటించిన సమయంలో అనేక అనుమానాలు, విమర్శలు వచ్చాయి. వాటిపై అప్పుడే కేసీఆర్‌ మాట్లాడారు. దళిత బంధు నిరంతర పథకమని చెప్పారు. దళిత బంధు పథకం అమలు చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలని కూడా చెప్పారు. లక్ష కోట్ల రూపాయలు ఒక పథకానికి కేటాయించడం సాధ్యమా..? అనే అనుమానాలు రేగాయి. దళితబంధు ప్రకటించిన తర్వాత… మాకు కూడా బంధు అమలు చేయండి అంటూ బీసీలు, ఎస్టీలు, వివిధ వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో దళిత బంధు సాధ్యమా..? అనే సందేహాలు నెలకొన్నాయి.

అయితే దళిత బంధుకు బడ్జెట్‌లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్‌.. అందరి అనుమానాలు, సందేహాలను పంటాపంచలు చేశారు. శాసన సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది బడ్జెట్‌లోనూ దళిత బంధుకు నిధులు కేటాయించేందుకు అవకాశం ఉంది. ఇదే మొత్తంలో వచ్చే ఏడాది కూడా నిధులు కేటాయిస్తే.. మొత్తంగా దళితులకు 37 వేల కోట్ల రూపాయలు దక్కుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి