iDreamPost

ఓటిటి విడుదల బ్రేక్ సాధ్యమేనా

ఓటిటి విడుదల బ్రేక్ సాధ్యమేనా

నిన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశంలో అక్టోబర్ దాకా నిర్మాతలు ఎవరూ డైరెక్ట్ ఓటిటి విడుదలలు చేయకూడదని నిర్మాతలకు విన్నవించడం చర్చకు దారి తీసింది. కాస్త సంయమనం పాటించాలని అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే ఎవరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. థియేటర్లు జూలై చివరి వారం నుంచి పూర్తిగా తెరుచుకునే ఆశాభావం కూడా అందులో వ్యక్తం చేశారు. కానీ దీని పట్ల అగ్ర నిర్మాతల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నారప్ప, దృశ్యం 2 గురించి గట్టి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సురేష్ బాబు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

నిజానికిది తీవ్రమైన సమస్యే. ఒకరిద్దరు మొదలుపెడితే అందరూ ఓటిటి బాట పడతారు. మాస్ట్రో డీల్ చేసుకున్న విషయం రెండు వారాల నుంచి నానుతూనే ఉంది.. దీని నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సైతం స్వయనా డిస్ట్రిబ్యూటర్ కావడం గమనార్హం. మరికొందరు స్ఫూర్తి చెందక ముందే ఛాంబర్ ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మంచిదే. ఒకవేళ ఎవరైనా ఈ వినతిని కాదని మరీ ఓటిటికి వెళ్తే వాళ్ళ పట్ల తమ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తామని చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది. బ్యాన్ చేయడమో లేక కొన్ని నెలల పాటు సదరు ప్రొడ్యూసర్లకు థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి కఠిన చర్యలు ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు.

ఇవన్నీ ఎవరూ ఊహించని పరిణామాలు కావడంతో దానికి తగ్గ సంసిద్ధత ఎవరి దగ్గరా లేకపోయింది. అసలు రాబోయే రోజులకు కూడా ఎవరూ గ్యారెంటీ ఇవ్వడం లేదు. మరోపక్క మహారాష్ట్ర లాంటి చోట్ల తెరిచిన థియేటర్లను మళ్ళీ మూసేస్తున్నారు. అందుకే అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ మరోసారి పునరాలోచనలో పడ్డట్టు ముంబై టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేవి సస్పెన్స్ సినిమాను తలపించేలా ఉన్నాయి. తమిళంలో మాత్రం ఓటిటి డెసిసిన్లు చకచకా జరుగుతున్నాయి. వారానికి రెండు మూడు డిజిటల్ అనౌన్స్ మెంట్లు వస్తున్నాయి. తెలుగులో దీనికి భిన్నంగా జరుగుతుందేమో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి