iDreamPost

రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ

రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ

తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ తో సహా పలు జిల్లాలు ఈ భారీ వానల ధాటికి చిగురుటాకుల వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో వర్షం విజృంభిస్తోంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌ విభాగం అప్రమత్తమైంది. భారీ వానల నేపథ్యంలో జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈసందర్భంగా  ఆయన కీలక సూచనలు చేశారు.

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ అప్రమత్తం చేశారు. వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో డీజీపీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులందరూ 24 గంటలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఆదేశించింది. సహాయం కోసం 100కు డయల్ చేయడం లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.  ఈ సమావేశంలో ప్రజలకు కూడా డీజీపీ పలు సూచనలు చేశారు.

ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, వీటి వద్దకు ఎవరు వెళ్లవద్దని సూచించారు. అలానే ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందస్తు జాగ్రత చర్యలు చేపట్టాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అలానే ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వరద ఉధృతితో తెగిపోయిన రోడ్లు, భారీగా ప్రవహించే కాజ్ వేల వద్దకు ప్రజలు వెళ్లవద్దని సూచించారు. అలానే  ఆ ప్రాంతాలకు ప్రజలకు వెళ్లకుండా రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్ ,బారికేడ్స్,హెచ్చరి బోర్టులను ఏర్పాటు  చేయాలని  ఆదేశించారు. అలానే వరదల కారణంగా ప్రమాదాలు జరగకుండా ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. విద్యుత్ విషయంలో ప్రజలను చైతన్య పర్చాలని సిబ్బందికి ఆదేశించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కల్వర్ట్, వంతెనలు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదని సూచించారు. కొందరు ఆకతాయిలను ఉద్దేశించి వరదల్లో పిచ్చి చేష్టాలు చేయొద్దంటూ డీజీపీ హెచ్చరించారు. మరి.. తెలంగాణ డీజీపీ చేసిన ఈ కీలక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండివిషాదం: పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి