iDreamPost

విషాదం: పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి!

విషాదం: పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.  రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, గుండె పోటు వంటి కారణాలతో పలువురు ప్రముఖులు మృతి చెందారు. ఇలా సెలబ్రిటీల మృతితో వారి కుటుంబంతో పాటు వారి అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే గుండెపోటు కారణంగా యువ ప్రముఖులు మృతి చెందుతున్నారు. గతంలో ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి, సినీ నటుడు తారకరత్న వంటి వారు గుండె పోటుతో మృతి చెందారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు మృతి చెందాడు.

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అతడిని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటినుంచి విష్ణువర్దన్ రెడ్డి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆరోగ్యం మరింత క్షీణించి గురువారం తెల్లవారు జామున 3.00 గంటల సమయంలో విష్ణువర్దన్ రెడ్డి మృతి చెందారు.

ఆయన మరణంతో ఎమ్మెల్యే ఇంటితో పాటు పటాన్‌చెరు నియోజకవర్గవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద కుమారుడి మరణంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విష్ణువర్దన్ రెడ్డి భౌతిక కాయానికి పలువురు నివాళర్పించారు. అలానే పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. కొడుకు మృతితో బాధలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డి.. తండ్రితో కలిసి నియోజకవర్గంలో జరిగే రాజకీయ కార్యక్రమాల్లో  చురుగ్గా పాల్గొనేవారు. గతంలో ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో విష్ణువర్ధన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. తమలో ఒకరిగా కలిసిపోయే వాడని..బీఆర్ఎస్ కార్యకర్తలు  అంటున్నారు.

ఇదీ చదవండిమోరంచపల్లి గ్రామానికి బయలు దేరిన ఆర్మీ హెలికాప్టర్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి