iDreamPost

వచ్చే వాళ్ళకంటే.. పోయే వాళ్ళే ఎక్కువున్నారా!

వచ్చే వాళ్ళకంటే.. పోయే వాళ్ళే ఎక్కువున్నారా!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితిని గమనిస్తున్న పరిశీలకులకు ఇప్పుడీ డౌటే ప్రధానంగా వస్తోందట. తెలుగు రాష్ట్రాలను ఏలేద్దామని బీజేపీ ఎప్పట్నుంచో కలలుకంటోంది. తెలంగాణాలో పార్టీ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం నోటాతోనే పోటీపడుతోంది. బలపడే అవకాశం వచ్చినప్పుడు టీడీపీ పల్లకీని మోస్తూ బీజేపీ నాయకులు పుణ్యకాలం గడిపేసారంటుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించిన సోము వీర్రాజు బీజేపీలో రారండోయ్‌.. అంటూ తలుపులు బార్లా తెరిచి బహిరంగ ఆహ్వానాలు ప్రతి వేదికపైనా పంచుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఏపీలోని ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి చేరే వారి సంఖ్య పెద్దగా ఉన్నట్టు కన్పించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రాధ్యక్షుడే స్వయంగా ఆహ్వానాలు పలుకుతున్నప్పటికీ నాయకుల నుంచి అంతంత మాత్రంగానే స్పందన ఉండడడం పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేయకమానదు.

దీనికి ప్రధాన కారణం నాయకుల్లో వేచి చూద్దాం.. అన్న ధోరణేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ పెద్దగా ప్రయోజనం కన్పించకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. మరో పక్క షెల్టర్‌ కోసం వెళ్ళాల్సిన అత్యవసరం ఉన్నవారం ఇప్పటికే బీజేపీకి చేరిపోయారన్న టాక్‌ కూడా నడుస్తోంది.

ఏపీకి భిన్నమైన పరిస్థితిని తెలంగాణాలో బీజేపీ ఎదుర్కొంటోంది. తెలంగాణా బీజేపీ నుంచి పలువురు ప్రముఖ నాయకులు టీఆర్‌ఎస్‌ బాట పట్టడం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలపరిచే అంశమేనని చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకోసం అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటున్న బీజేపీకి తెలంగాణాలోని పరిణామాలు మింగుడు పడడం లేదంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రంలోనే నాయకుల నుంచి ఈ విధమైన స్పందన అనూహ్యంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. జీహెచ్‌యంసీ వంటి కీలక ఎన్నికలను ఎదుర్కొవాల్సిన పరిస్థితుల్లో కాస్తోకూస్తో పట్టుందనుకుంటున్న తెలంగాణా బీజేపీ నుంచే నాయకులు వలసల బాట పట్టడం ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీలోకి చేరికలపై నాయకుల అభిప్రాయాన్ని పునరాలోచించుకునేదిగా ఉంటుందంటున్నారు పరిశీలకులు.

ఎంతగా పోరాడుతున్నప్పటికీ టీఆర్‌ఎస్‌ను నెగ్గుకు రాలేకపోవడంతోనే టీ–బీజేపీ నాయకులు తమదారి తాము చూసుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న బీజేపీ ఈ రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం అమలు చేయనున్న వ్యూహాలపై ఆసక్తిని పెంచుతోందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి