iDreamPost

Tegimpu Telugu Movie Review తెగింపు రివ్యూ

Tegimpu Telugu Movie Review తెగింపు రివ్యూ

కొత్త సంవత్సరం సంక్రాంతి ఈసారి డబ్బింగ్ సినిమాతో మొదలైంది. నిజానికి ఈ రోజు విజయ్ వారసుడు కూడా రావాల్సి ఉన్నప్పటికీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల కోసం రెండు రోజులు వాయిదా వేసుకున్నానని దిల్ రాజు కొద్దిరోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అజిత్ తెగింపుకు అడ్డు లేకుండా సోలోగా వచ్చేసింది. అనూహ్యంగా స్పేస్ దొరకడంతో హీరో రేంజ్ మార్కెట్ కన్నా చాలా ఎక్కువ థియేటర్లు దీనికి దొరికాయి. దానికి తోడు తమిళంలో ఉన్న హైప్, ట్రైలర్ చూశాక మన ఆడియన్స్ కూ దీని మీద ఆసక్తి కలిగింది. బోనీ కపూర్ నిర్మాతగా వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

వైజాగ్ నడిబొడ్డున ఉన్న యువర్ బ్యాంక్ ని దోచుకోవడానికి ఓ దొంగల ముఠా పట్టపగలే అందులోకి చొరబడుతుంది. అయితే వాళ్ళు ఊహించని విధంగా లోపల మరో ఆగంతకుడు(అజిత్)ఇదే పని మీద వచ్చి ఉండటం చూసి షాక్ తింటారు. మొత్తం అందరినీ తన కంట్రోల్ లో ఉంచుకున్న డెవిల్ అని పిలవబడే ఆ కొత్త వ్యక్తి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతాడు. వ్యవస్థలోని పవర్ మొత్తం దీని కోసం వినియోగించాల్సి వస్తుంది. దీంతో పాతిక వేల కోట్లకు సంబంధించిన స్కామ్ ఒకటి బయట పడుతుంది. అతను ఇంత సాహసం ఎందుకు చేశాడు,గతమేంటి, అసలు ఉద్దేశం ఏంటని తెలియాలంటే తెగించి టికెట్లు కొనాల్సిందే

నటీనటులు

అజిత్ స్వాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గ్యాంబ్లర్ నుంచి తెల్లగడ్డంతో కొత్త స్టైల్ లోకి షిఫ్ట్ అయిపోయాక అది మార్చేందుకు ఇష్టపడటం లేదు. విశ్వాసం నుంచి ఈ తెగింపు దాకా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయిన లుక్ ని ఇందులో ఇంకాస్త గట్టిగా పెంచి కనిపించాడు. నటన పరంగా ఎప్పటి లాగే చేసుకుంటూ పోయాడు. మరీ ఛాలెంజ్ అనిపించే సన్నివేశాలు కానీ తను మాత్రమే ఇది చేయగలడని పించే రేంజ్ లో పెద్ద స్టఫ్ ఏమి లేదు. అక్కడక్కడా మంచి డాన్స్ మూమెంట్స్ పెట్టారు కానీ అవి అభిమానులకు మాత్రమే. కమల్ హాసన్, విక్రమ్ లాగా పూర్తి వైవిధ్యమున్న పాత్రల జోలికి వెళ్లకుండా కేవలం సేఫ్ గేమ్ ఆడుతున్న అజిత్ ఇందులోనూ అదే చేశాడు

ఇందులో ప్రత్యేకంగా గ్లామర్ కోసం వాడుకున్న హీరోయిన్ అంటూ ఎవరు లేరు. మంజు వారియర్ కి ప్రాధాన్యం దక్కింది కానీ మరీ ప్రత్యేకంగా చెప్పుకునే రీతిలో లేదు. లుక్స్ పరంగా ఆకట్టుకోవడం బాగుంది. మెయిన్ విలన్ గా నటించిన జాన్ కొక్కెన్ కన్నా బెటర్ ఛాయస్ చూసి ఉండాల్సింది. ఎక్కువ వేరియేషన్స్ ని డిమాండ్ చేసే ఇలాంటి క్యారెక్టర్స్ కి సరితూగడు. పోలీస్ కమీషనర్ గా సముతిరఖనిది పరమ రొటీన్. ఆయన అలాగే చేసుకుంటూ పోయారు. పావని రెడ్డి, మమతాచారి, వీర, భగవతి పెరుమాళ్, జిఎం సుందర్, ప్రేమ్ కుమార్ క్యాస్టింగ్ చాలానే ఉంది. తెలుగు నటుడు అజయ్ ఉన్నంతలో ఉనికిని చాటుకున్నాడు

డైరెక్టర్ అండ్ టీమ్

ఎప్పుడో 1994లో శంకర్ జెంటిల్ మెన్ ద్వారా ఒక ఫార్ములా పరిచయం చేశాడు. సామజిక సమస్యను తీసుకుని దాని వల్ల బాధింపబడ్డ వాళ్ళలో హీరో కుటుంబాన్ని పెట్టి ఆ పాయింట్ చుట్టూ కమర్షియల్ కోటింగ్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడం, భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి వాటిలో ఇది అద్భుతంగా పండింది. దీన్ని ఎందరో డైరెక్టర్లు ఫాలో అయ్యారు. మురుగదాస్ ఇలా తీసిన రమణనే చిరంజీవి ఏరికోరి మరీ ఠాగూర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అపరిచితుడులోనూ ఇదే ఉంటుంది. అయితే క్రమంగా ఇంత కన్నా గొప్పగా చెప్పలేకపోతున్న రచయితలు దీన్ని కాస్తా మూస ఫార్ములాలోకి తీసుకెళ్ళిపోయి ఒక రొటీన్ ఎఫైర్ గా మార్చారు.

తెగింపు అదే కోవలోకి వస్తుంది. ఆ మధ్య సర్కారు వారి పాటలో మహేష్ బాబు బ్యాంక్ లో వందల కోట్ల లోన్లు తీసుకుని ఎగొట్టే పెద్ద మనుషుల భరతం పట్టడం గుర్తుందిగా. వినోత్ దాన్నే ఇంకోలా మార్చి ఇవే బ్యాంకులు కస్టమర్లకు మ్యూచువల్ ఫండ్స్ పేరిట ఎరవేసి వేల కోట్ల కుంభకోణాలు ఎలా చేస్తున్నారన్న అంశాన్ని స్పృశించాడు. వినడానికి బాగానే ఉంది కానీ సబ్జెక్టులో తగినంత డెప్త్ లేకపోవడంతో పాటు సరైన రీసెర్చ్ లోపించడం వల్ల తెగింపు కాస్తా ఆలోచనకు ఆచరణకు మధ్య నలిగిపోయి ఒక మాములు సినిమాగా మిగిలిపోయింది. టెక్నికల్ గా ఒక డైరెక్టర్ ఎంత గొప్పవాడైనా కావొచ్చు. అది ఆడియన్స్ కి కనెక్ట్ కాలేనప్పుడు ప్రయోజనం లేదు కదా

కేవలం హీరోకున్న ఫాలోయింగ్ ని ఆధారంగా చేసుకునో అతని స్టైల్ ని దృష్టిలో పెట్టుకునో కథలు రాసుకుంటే సరిపోదు. ట్విస్టులు, కన్విన్సింగ్ అనిపించే ట్రిక్కులు ఇవన్నీ సరిగ్గా వాడాలి. గ్యాంబ్లర్ అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం ఏమిటి. ఇవేగా. ప్రతి పావు గంటకో ఊహించని కథనంతో వెంకట్ ప్రభు మన మెదడుని పరుగులు పెట్టిస్తాడు. ఇదే వినోత్ కార్తీతో తీసిన ఖాకీలో చేసింది కూడా ఇదే. కానీ తెగింపుకు వచ్చేసరికి తనలో క్రియేటివిటీ అజిత్ మాస్ ఇమేజ్ ముందు తడబడింది. సినిమాలు వెబ్ సిరీస్ లో ఎన్నోసార్లు చూసేసిన రాబరీ కాన్సెప్ట్ ని మళ్ళీ తీసుకున్నాడు కానీ దాన్ని సరైన రీతిలో ఎంగేజింగ్ గా చెప్పడంలో మాత్రం సోసో అనిపించాడు

ఫాంటసీ కథల్లో లాజిక్స్ అక్కర్లేదు కానీ తెగింపు లాంటి వాటికి కావాలి. నమ్మశక్యం కానీ రీతిలో ఏదైనా మేజిక్ చేయాలనుకుంటే జనం అంత గుడ్డిగా నమ్మరు. ఏ దేశమైనా ప్రభుత్వమైనా ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టే ఎలాంటి నిర్ణయం తీసుకోదు. అలాంటిది క్లైమాక్స్ లో జనం ఎంత మంది చచ్చినా పర్లేదు డబ్బు ముఖ్యమనుకునేలా సిఎం స్థాయిలో డెసిషన్ తీసుకున్నట్టు డిజైన్ చేసిన ఎపిసోడ్ మరీ సిల్లీగా ఉంది. ముప్పాతిక సినిమా కేవలం బ్యాంకు సెట్ లోనే సాగుతుంది.ఇలా అయితే ఖర్చు పెట్టలేదనుకుంటారని సముద్రంలో పెట్టిన ఛేజులు, హెలికాఫ్టర్లు ఇవన్నీ కృత్రిమంగా ఉన్నాయే తప్ప నిజంగా ఇవి డిమాండ్ చేసేంత కంటెంట్ ఉందనిపించదు

సాంకేతికంగా తెగింపులో అన్నీ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిచినా అక్కడక్కడా సీన్లు, అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదోలా కాపాడుకుంటూ వచ్చాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు ఫ్లాష్ బ్యాక్ లు అటు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేక ఇటు మెసేజ్ పరంగా కొత్తగా అనిపించలేక మధ్యలో నలిగిపోయి ఇబ్బంది పెడతాయి. ఇరవై నిమిషాల దాకా అజిత్ కనిపించకుండా ఒక సేల్స్ ఏజెంట్ చావు మీద సెపరేట్ ట్రాక్ నడిపించడం సింక్ కాలేదు. ఇంకా బెటర్ గా ఉండాల్సిందన్న ఫీలింగ్ కల్గుతూనే ఉంటుంది. పైగా మనీ హీస్ట్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వెబ్ సిరీస్ చూస్తున్న ఇప్పటి జెనరేషన్ కి తెగింపు లాంటివి సగం ఉడికిన గుడ్లలా అనిపిస్తాయి

అజిత్ తప్ప సినిమా చూసేందుకు మరో కారణం అక్కర్లేదు అనుకుంటే తెగింపుని ట్రై చేయొచ్చు. అలా అని మాస్ కి ఎక్కేసే అంశాలు పెద్దగా లేవు. పోనీ పాటలైనా ఎంటర్ టైన్మెంట్ ఇస్తాయా అంటే వాటికి చోటే దక్కలేదు. ఉన్న ఒక్క బీట్ సాంగ్ కూడా అజిత్ స్టెప్పులు చూడలేక సెల్ ఫోన్ అప్ డేట్స్ కి పరిమితం అయ్యేలా చేసింది. ఏదో బోయపాటి శీను లాంటోళ్ళను ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే యాక్షన్ తీస్తాడని అంటాం కానీ అంతకన్నా ఎక్కువగా అరవ దర్శకులు ఎలా ఆలోచిస్తారో ఈ మూవీలో ఆఖరి ఘట్టం చూస్తే అర్థమవుతుంది. సర్కారు వారి పాట ఏ విషయంలో తడబడి అంచనాలను పూర్తిగా అందుకోలేధో ఈ తెగింపు కనీసం సగం కూడా చేరుకోలేక నిలిచింది

గిబ్రాన్ సంగీతంలో పెద్దగా మెరుపులేం లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా తన స్పార్క్ ఉంది కానీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేసేలా నేపధ్య సంగీతం అంతగా కుదరలేదు. ఎన్ని ట్యూన్స్ చేయించుకున్నారో కానీ ఉన్న ఒక్క పాట కూడా తేలిపోయింది. నిరవ్ షా ఛాయాగ్రహణం బాగా రాజీ పడిన క్వాలిటీని ఎలివేట్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. ఆయన లోపమేమి లేదు. సిజి వర్క్ లో జరిగిన తప్పులకు బాధ్యుణ్ణి చేయలేం. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ లో లోపాలున్నాయి. రెండో సగం గందరగోళం మీద కొంత ఫోకస్ పెట్టాల్సింది. అజిత్ తో వరసగా మూడో సినిమా నిర్మించిన బోనీ కపూర్ మరో సారి తన ప్రొడ్యూసర్ తెలివిని చూపించారు

ప్లస్ గా అనిపించేవి

అజిత్ లుక్స్
టెక్నికల్ టీమ్ పనితనం
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

ఎక్కువైన సినిమాటిక్ లిబర్టీ
ఫ్లాష్ బ్యాక్స్
గూస్ బంప్స్ మూమెంట్స్ లేకపోవడం
సంగీతం

కంక్లూజన్

ఒకపక్క ఊరమాస్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన సంక్రాంతి పండక్కు చిరంజీవి బాలకృష్ణ లాంటి కమర్షియల్ దిగ్గజాలు వస్తున్న టైంలో తెగింపు లాంటివి వాటి మధ్య నెగ్గుకురావాలంటే చాలా బలమైన కంటెంట్ ఉండాలి. తెగింపులో పాయింట్ బాగున్నప్పటికీ ప్రెజెంటేషన్ లో జరిగిన తడబాటు వల్ల మరీ గొప్పగా అనిపించకవచ్చు. తమిళంలో బ్లాక్ బస్టర్ కావొచ్చు కోట్లలో వసూళ్లు రావొచ్చు. కానీ తెలుగు ఆడియన్స్ కోణంలో చూసుకుంటే ప్రత్యేకంగా చెప్పుకునే ఎలాంటి అంశం లేని తెగింపుని ముందే చెప్పినట్టు అజిత్ ఉంటే చాలనుకుంటే ట్రై చేయొచ్చు. కాకపోతే ఒకప్పటి కల్ట్ యాక్షన్ మూవీస్ రేంజ్ లో కొంచెం కూడా ఊహించుకోకుంటే చాలు

ఒక్క మాటలో : తగ్గింపు

రేటింగ్ : 2 / 5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి