iDreamPost
android-app
ios-app

ఏషియన్ గేమ్స్ లో తిలక్ వర్మ థండర్ ఫిఫ్టీ! T-shirt పైకెత్తి..

  • Author Soma Sekhar Published - 10:44 AM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 10:44 AM, Fri - 6 October 23
ఏషియన్ గేమ్స్ లో తిలక్ వర్మ థండర్ ఫిఫ్టీ! T-shirt పైకెత్తి..

ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా పురుషుల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన సెమీఫైనల్-1 లో బంగ్లాదేశ్ జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియాకు పతకం ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తెలుగు తేజం తిలక్ వర్మ బ్యాట్ తో రాణించారు. ముఖ్యంగా తిలక్ వర్మ సునామీ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. తొలుత బౌలర్లు చెలరేగడంతో.. బంగ్లా జట్టు కేవలం 96 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ అనంతరం తిలక్ వర్మ సెలబ్రేట్ చేసుకున్న ఎమోషనల్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పురుషుల జట్టు బంగ్లాదేశ్ టీమ్ ను మట్టికరిపించి ఫైనల్ కు దూసుకెళ్లింది. భారత బౌలర్లు చెలరేగడంతో.. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో జాకీర్ అలీ 24* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో సాయి కిశోర్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

గత మ్యాచ్ సెంచరీ హీరో జైస్వాల్ ఈ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ, కెప్టెన్ గైక్వాడ్ తో కలిసి బంగ్లా బౌలర్లను చితక్కొట్టాడు. వీరిద్దరు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ కేవలం 25 బంతుల్లోనే తన ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్నాడు. 26 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే అతడు తన ఫిఫ్టీ అనంతరం చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సాధారణంగా ఆటగాళ్లు హాఫ్ సెంచరీ, సెంచరీలు చేస్తే.. దాని పలు విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఈ క్రమంలోనే తిలక్ వర్మ సైతం ఎమోషనల్ గా తన అర్దశతకాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత తిలక్ వర్మ జెర్సీ పైకెత్తి తన ఒంటిపై ఉన్న అమ్మానాన్నల టాటూను చూపిస్తూ.. దేవుడికి మెుక్కుకున్నాడు. అమ్మానాన్నలపై తనకున్న ప్రేమను ఈ విధంగా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఈ మ్యాచ్ లో గైక్వాడ్ మూడో ఓవర్ లో బంగ్లా బౌలర్ కు చుక్కలు చూపించాడు. 6,6,4,4 బాది ఈ ఓవర్ లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. గైక్వాడ్ 26 బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. మరి తిలక్ వర్మ ఎమోషనల్ సెలబ్రేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.