iDreamPost

జీవీఎల్ ను టార్గెట్ చేసిన టీడీపీ

జీవీఎల్ ను టార్గెట్ చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు టీడీపీ నేతలకు కొరగాని కొయ్యలా తయారయ్యారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతినే కొనసాగించాలని టీడీపీ నేతలు చేస్తున్న పోరాటాలకు జీవీఎల్‌ గండికొడుతున్నట్లున్నారు.

నిరసనలు, ఉద్యమాలు.. పత్రికల్లో అమరావతి అనుకూల రాతలు.. ఇలా ఎన్ని చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యమానికి అడ్డుపెట్టుకోవాలని భావిస్తున్నారు. రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, దానికి కేంద్రం అనుమతి కావాలంటూ.. వాదనలు వినిపిస్తున్నారు. వీరి వాదనలు తేలిపోయేలా.. జీవీఎల్‌.. కేంద్ర ప్రభుత్వ విధులు, అధికారాల గురించి మాట్లాడుతూ టీడీపీ నేతల కంట్లో నలుసులా మారారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరి తదితర బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. అయితే వీరికి లక్ష్యాలకు గండికొట్టేలా జీవీఎల్‌ నరసింహారావు అసలు విషయం కుండ బద్దలు కొడుతున్నారు. రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదంటూ.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించబోదని స్పష్టం చేస్తున్నారు. రాజధానితోపాటు.. మండలి రద్దు వ్యవహారం కూడా నిబంధనల మేరకే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యమాలు చేద్దామని, రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంపై తోసేద్దామని భావిస్తున్న టీడీపీ, బీజేపీలోని ఓ వర్గం నేతల ఆశలకు జీవీఎల్‌ అడ్డుపడుతున్నారు. బీజేపీలో జీవీఎల్, సోము వీర్రాజులు ఆది నుంచి ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా. లేకపోయినా.. వీరు పార్టీలోనే కొనసాగుతున్నారు. మధ్యలో కొంత మంది నేతలు వస్తున్నారు.. పోతున్నారు. అందుకే జీవీఎల్, సోము వీర్రాజుల మాటలకు ప్రజల్లో ఎక్కువగా విశ్వాసం ఉంటోంది. బీజేపీ విధానం ఏదంటే.. సోము వీర్రాజు, జీవీఎల్‌ ప్రకటనలే ఫైనల్‌ అనేలా పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలోనే తమ లక్ష్యాలకు అడ్డుపడుతున్న జీవీఎల్‌పై టీడీపీ, అమరావతి మద్ధతుదారులు ఫైర్‌ అవుతున్నారు. ఆయన్ను టార్గెట్‌ చేస్తున్నారు. జీవీఎల్‌ జగన్‌ ఏజంట్‌ అని, జగన్‌తో కుమ్మక్కయ్యారని, జగన్.. జీవిఎల్.. ఒక్కటయ్యారని.. అమ్ముడుపోయారని.. ఇలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నిన్న శుక్రవారం మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పు, టీడీపీ నేత వర్ల రామయ్యలు జీవీఎల్‌పై పై విధంగా ఫైర్‌ అయ్యారు. వీరితోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా జీవీఎల్‌ను విమర్శించడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి