iDreamPost

తీవ్ర ఒత్తిడిలో టీడీపీ , పదే పదే సెల్ఫ్ గోల్స్ తో అప్రదిష్ట పాలు …

తీవ్ర ఒత్తిడిలో టీడీపీ , పదే పదే సెల్ఫ్ గోల్స్ తో అప్రదిష్ట పాలు …

బహుశా చంద్రబాబు గారి టైం బాగున్నట్టు లేదు . టీడీపీ అధికారంలో ఉండగా ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియోల రూపంలో రేవంత్ రెడ్డితో పాటు సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన కేసు ప్రజల్లో టీడీపీ పట్ల చులకన భావన కలగటానికి కారణం కాగా తర్వాత కాలంలో అసత్య ఆరోపణలతో , అడ్డగోలు అనైతిక చర్యలతో పదే పదే దొరికిపోవటం ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యాయని చెప్పొచ్చు .

తాజాగా ఈ నెల పదమూడవ తారీఖు 11 గంటల సమయంలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు , మాజీ టీడీపీ నేత , ప్రస్తుతం బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ.. అలాగే మాజీ టీడీపీ నేత ,గత ప్రభుత్వ హయాంలో బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి పదవి నిర్వహించిన కామినేని శ్రీనివాస్… టీడీపీ ప్రభుత్వ సిఫారసుతో ఎన్నికల కమిషనర్ గా నియమితుడై ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి తెలియకుండా నిర్ణయాలు తీసుకొని పలు వివాదాలకు కేంద్రమై , కోర్టులో కొన్ని కేసుల్లో వాది , ప్రతివాదిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్లు ముగ్గురూ పార్క్ హయత్ హోటల్లో సమావేశమైన వీడియో ఫుటేజ్ బయటికి రావడం సంచలనం సృష్టించడంతో పాటు , టీడీపీని మరింత అప్రదిష్ట పాలు చేసింది .

సాధారణ రాజకీయ నాయకుల భేటీ అయితే ఏ ప్రాధాన్యతా ఉండదు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విషయంలోనూ , వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ కేంద్రానికి రాసిన లేఖ విషయంలోనూ పలు వివాదాలు నడుస్తుండగా , ఈ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యిన బిజెపి నేత కామినేని శ్రీనివాస్ , బీజేపీలో చేరినా టీడీపీకి అనుకూలంగా స్పందిస్తాడు అని ఆరోపణలున్న సుజనా చౌదరి , టీడీపీతో కుమ్మక్కు అయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాస్పదం చేసాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ల రహస్య భేటీ ఎందుకన్నది చర్చనీయాంశం అయింది .

ఈ ఘటన వివాదాస్పదం అయ్యిన వెంటనే మీటింగ్ లో పాల్గొన్న బిజెపి నేతలు కానీ , వారికి సపోర్ట్ గా బిజెపి రాష్ట్ర కార్యవర్గం కానీ , వివాదాస్పద మాజీ ? ఎన్నికల అధికారి కానీ ఏ విధమైన వివరణ ఇవ్వక పూర్వమే ఈ ఘటనతో బహిరంగ సంభందం లేని టీడీపీ పార్టీ నుండి అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఈ మీటింగ్ ని సమర్థిస్తూ తీవ్రంగా స్పందించడం విశేషం. వీడియో ఫుటేజ్ బయట పడ్డ తర్వాత మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య సుజనా , కామినేని , నిమ్మగడ్డల భేటీలో వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల పట్ల , వింత పోకడల పట్ల , రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న తీరు పట్ల చర్చించారు అది తప్పా ? అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించి హడావుడి చేసారు .

అయితే రాజ్యాంగ బద్ధ పదవి నిర్వహిస్తూ వివాదాస్పద అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నేతలతో వ్యక్తిగతంగా భేటీ కావడాన్ని సమర్థిస్తూ ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేక చర్చలు చేశారు అని చెప్పడం నిమ్మగడ్డని చిక్కుల్లో పడవేయడమే అని చెప్పొచ్చు . నిమ్మగడ్డ పదవి అంశం ప్రస్తుతం కోర్ట్ పరిధిలో ఉండగా అది తేలేంత వరకూ నిమ్మగడ్డ పదవీ కాలం సాంకేతికంగా ముగిసినట్టు కాదు . ప్రభావిత ఉన్నత స్థానంలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకులతో ఆఫీస్ లో కాక హోటల్ లో అంతర్గతంగా చర్చించడమే అనుమానాలకు ఆస్కారమిచ్చే ఘటన కాగా వారు ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని , రాజ్యాంగ బద్దంగా నడవట్లేదని చర్చించుకొన్నారని తెలపడం ఖచ్చితంగా నిమ్మగడ్డని ఇరుకున పడేసే అంశమే .

తాజాగా ఈ సాయంత్రం ఈ భేటీ పట్ల సుజనాచౌదరి ఓ లేఖ విడుదల చేసారు .

ఇటీవల కాలంలో తన వ్యాపార కార్యకలాపాలు పార్క్ హయత్ నుండి నిర్వహిస్తున్నానని , అందులో భాగంగా కామినేని అపాయింట్మెంట్ తీసుకొని కలిసాడని , అలాగే నిమ్మగడ్డ తమ కుటుంబానికి ఆత్మీయులు అని ఆ సంభందంతో కలిసామని ఇటీవలి రాజకీయ పరిణామాలు , విధి నిర్వహణలో జరిగిన దృష్టాంతాలు ఏమీ ఈ భేటీలో చర్చించలేదని వర్ల రామయ్య సమర్ధనకి పూర్తి వ్యతిరేకంగా వివరణ ఇచ్చుకున్నారు. సుజనా చౌదరి ఇచ్చుకొన్న ఈ వివరణతో టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇరకాటంలో పడ్డట్టు అయ్యింది .

భేటీలో పాల్గొన్న వారిలో ఇద్దరు ప్రస్తుతం బిజెపి నేతలు , ఒకరు కోర్ట్ వివాదంలో ఉన్న మాజీ? ప్రభుత్వ అధికారి కాగా ఫుటేజ్ బయట పడగానే వారి నుండి ఏ వివరణ రాకముందే వేగంగా టీడీపీ పార్టీ ఎందుకు స్పందించింది . భేటీలో విషయాలు మొత్తం ప్రెస్ మీట్ లో చెప్పిన వర్ల రామయ్యకి సదరు అంశాలు ఎలా తెలిశాయి . అందరూ అనుకొంటున్నట్లు నిమ్మగడ్డ , సుజనా చౌదరి లతో టీడీపీ రహస్య సంబంధాలు మైంటైన్ చేస్తుందా?.

ఈసీ పదవి పై నిమ్మగడ్డ కేసు విషయంలో మాజీ టీడీపీ నేత కామినేని , మరికొందరు ఇంప్లీడ్ అయ్యిన ఘటన వెనుక టీడీపీ హస్తం ఉందా అనే అనుమానాలు మరోసారి ప్రజల మదిలో బలంగా మెదలగా రాజకీయ, నిమ్మగడ్డ వృత్తిపర విషయాల పై ఏమీ సంభందం లేదని సుజనా ఇచ్చిన వివరణ తర్వాత ఏమీ మాట్లాడలేని సంకట స్థితిలో టీడీపీ నేతలు పడ్డారని చెప్పొచ్చు .

ఇహ ఈ భేటీ పై వివాదాస్పద మాజీ? ప్రభుత్వ అధికారి నిమ్మగడ్డ , ప్రస్తుత బిజెపి నేత కామినేని ఎలా స్పందిస్తారో , ఈ వివాదాస్పద భేటీ పట్ల బిజెపి రాష్ట్ర జాతీయ నాయకులు సుజనా ,కామినేనిలకు అండగా ఉంటారా ? , ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి