iDreamPost

వ‌లంటీర్ల‌పై త‌గునా ఇలాంటి వ్యాఖ్య‌లు?

వ‌లంటీర్ల‌పై త‌గునా ఇలాంటి వ్యాఖ్య‌లు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా ప‌ని చేస్తున్నారు వ‌లంటీర్లు. నిజంగా వ‌లంటీర్ అన్న ప‌దానికి న్యాయంచేస్తూ ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛందంగా సేవ‌లు అందిస్తున్నారు. క‌రోనా అంటే భ‌యంక‌ర‌మైన వైర‌స్ గా ప్ర‌చారం జ‌రిగిన రోజుల్లో కూడా వ‌లంటీర్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే నిలిచారు. ప్రాణాల‌కు తెగించి వారి అవ‌స‌రాల‌ను తీర్చారు. మ‌హ‌మ్మారి బారిన ప‌డిన‌వారి బాగోగుల‌ను కూడా చూసుకున్నారు. వారికి త‌క్ష‌ణం ప్ర‌భుత్వ సేవ‌లు అందేలా చేయ‌డంలో ముందు వ‌రుస‌లో నిలిచారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డంలో ఏపీ దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచిందంటే.. అందులో వ‌లంటీర్ల పాత్ర కీల‌కం. మ‌ర‌ణాల రేటును త‌గ్గించ‌డంలోనూ వారి పాత్ర‌ను కాద‌న‌లేం. ఆ విష‌యం ప‌క్క‌నబెడితే.. గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో అవినీతికి తావు లేకుండా ప్ర‌జ‌ల సొమ్ము రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌కుండా ప‌థ‌కాల ద్వారా వేలాది రూపాయ‌లు పొందుతున్నారంటే అది వారి పుణ్య‌మే.

అలాంటి వ‌లంటీర్ల‌ను స‌త్క‌రించ‌డం నేర‌మా. ప్ర‌జ‌లకోసం ప‌నిచేస్తున్న వారిని గుర్తించ‌డం పాప‌మా. ఈ ప్ర‌శ్నలు ఎందుకంటే.. అది నేర‌మో, పాప‌మో అన్న‌ట్లుగానే ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం నేత‌ల స్టేట్ మెంట్లు ఉంటున్నాయి. వారి సేవ‌ల‌కు ముఖ్య‌మంత్రి లాంటి వ్య‌క్తులు సెల్యూట్ చేస్తే.. టీడీపీ నేత‌లు వారిని చిన్న‌చూపు చూస్తున్నారు. ఈరోజు వ‌లంటీర్ల‌కు జ‌రుగుతున్న స‌త్కారాల‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వ‌లంటీర్లకు సన్మానం పేరుతో రూ.233 కోట్లు తగలేస్తూ పండగ చేసుకుంటున్నార‌ని అన్నారు. క‌రెంటు కోత‌ల‌కు, ఈ స‌త్కారాల‌కు లింకు పెడుతూ వింత‌గా స్పందించారు. దీనిపై వ‌లంటీర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరో టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య స్పందిస్తూ.. ఏపీలో వ‌లంటీర్లు ఏం ఘనకార్యాలు చేశారని సేవా సత్కారాలు చేస్తున్నారని ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీకి సేవలందించినందుకు ప్రజల సొమ్ము దోచిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకు, దొంగ మద్యం అమ్మినందుకు సన్మానిస్తున్నారా అంటూ.. వ‌లంటీర్ల‌ను దోపిడీదారులు, దొంగ‌లుగా చిత్రీక‌రించ‌డం విచార‌క‌రం. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా స‌ర్కారు కు మంచిపేరు రావ‌డం జీర్ణించుకోలేక టీడీపీ నేత‌లు ఇలా దారుణంగా స్పందిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి