iDreamPost

నారా లోకేష్ పాదయాత్ర సన్నాహాలు, టీడీపీ నేతల్లో భిన్నస్వరాలు

నారా లోకేష్ పాదయాత్ర సన్నాహాలు, టీడీపీ నేతల్లో భిన్నస్వరాలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అనేకరకాల తలనొప్పులు వెంటాడుతున్నాయి. పార్టీ కష్టాల నుంచి గట్టెక్కాలని చేస్తున్న యత్నాలు పదేపదే విఫలమవుతున్నాయి. శ్రేణులను సమాయత్తం చేయాల్సిన నాయకత్వం అందుకు భిన్నంగా ఉండడంతో విపక్షం విలవిల్లాడుతోంది. కోలుకోగలుగుతుందా అనే సందేహాలను లేవనెత్తుతోంది. ఈ తరుణంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది. దానికి తగ్గట్టుగా పార్టీలో పునరుత్తేజం నింపేందుకు చివరి అస్త్రంగా పాదయాత్రను ఎంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ పాదయాత్ర ఎవరు చేయాలనే దానిపై పార్టీలోనే ఏకాభిప్రాయం కొరవడినట్టు కనిపిస్తోంది. బహిరంగంగా టీడీపీ క్యాంప్ నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు అందుకు అద్దంపడుతున్నాయి.

గతంలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. అయినా టీడీపీకి అది ఏమేరకు ఉపయోగపడిందనే దానిపై పలు సందేహాలున్నాయి. రాష్ట్రవిభజన కారణంగా మారిన రాజకీయ పరిణామాల్లో స్వల్ప ఓట్లతో గట్టెక్కడం తప్ప పాదయాత్ర ద్వారా చంద్రబాబుకి స్వింగ్ వచ్చిన దాఖలాలు లేవు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ అనుభవాలు అందుకు భిన్నం. కాబట్టి ఇప్పుడు మరోసారి చంద్రబాబు పాదయాత్ర చేయాలనే ఆలోచనను పార్టీలో కొందరు సీనియర్లు ప్రస్తావించినప్పటికీ వయసు, ఆరోగ్యం ఏమేరకు సహకరిస్తుందోననే సందేహాలతో విరమించుకున్నారు. ఈ తరుణంలో పాదయాత్ర ద్వారా తాను టీడీపీలో పూర్తి పట్టు సాధించాలనే సంకల్పంతో నారా లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. అధికారం దక్కినా లేకున్నా టీడీపీ నాయకత్వంలో పూర్తిగా ఆధిక్యత సాధించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. టీడీపీకి చంద్రబాబు తర్వాత ఎవరూ అనే ప్రశ్న ఉత్పన్నమయిన ప్రతీసందర్భంలోనూ లోకేష్ తీరుమీద పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో పాదయాత్ర ద్వారా వాటిని అధిగమించాలనే ఆలోచన ఆయన చేస్తున్నట్టు తెలుస్తోంది.

నారా లోకేష్ పాదయాత్ర విషయంలో మాత్రం టీడీపీ నేతలు కొందరు పెదవి విరుస్తున్నారు. ఇటీవల అమరావతి జేఏసీ నేత కొటికిలపూడి శ్రీనివాస్ ఏబీఎన్ చానెల్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు దానికి అద్దంపడతాయి. నారా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి వారానికి ఒక పార్లమెంట్ సీటు పరిధిలో తిరగాలని, నారా బ్రాహ్మణి మాత్రం తిరుపతి నుంచి పాదయాత్ర చేయాలని ఆయన వ్యాఖ్యానించారు తద్వారా అటు నందమూరి, ఇటు నారా కుటుంబాల వారసత్వం ఆమెకు దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం నారా లోకేష్ మీద విశ్వాసంలేని కారణంగానే ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. లోకేష్ నాయకత్వం మీద నమ్మకం లేని అనేకమంది ఇదేరీతిలో స్పందిస్తుండగా శ్రీనివాస్ నేరుగా దానిని వ్యక్తం చేసినట్టు భావిస్తున్నారు. లోకేష్ యాత్ర చేసినా ఉపయోగం ఉండదనే అభిప్రాయంతో ఉన్న వారి మనసులో మాటను ఆయన బయటపెట్టినట్టు అంచనా వేస్తున్నారు.

లోకేష్ మాత్రం తాను పార్టీకి కాబోయే సారధిగా పాదయాత్ర చేయాలనే ఆలోచనతో సన్నాహాలు కూడా షురూ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు నెలలుగా ప్రజల్లో కనిపించకపోవడానికి ఇదో కారణమని కూడా చెబుతున్నారు. సుదీర్ఘకాలం యాత్ర చేయాలనే సంకల్పంతో దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. విశాఖలో కోర్టుకి హాజరయిన సందర్భంలో కూడా లోకేష్ వ్యాఖ్యలు దానిని తలపిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లాలని తనకు కొడుకు సూచిస్తున్నట్టు లోకేష్ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ త్వరగా యాత్ర చేయాలనే ఉద్దేశం ఆయన బయటపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో ప్రధాని పదవి తీసుకోవద్దని పదోతరగతిలో ఉండగా లోకేష్ చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇంట్లో ఉండకుండా ప్రజల్లోకివెళ్లాలని తన కొడుకు చెబుతున్నట్టు లోకేష్ మాట్లాడడం కనిపిస్తోంది. ఏమయినా త్వరలో పాదయాత్ర చేయాలనే ఆలోచనలో దృఢంగా లోకేష్ ఉండగా, టీడీపీ కార్యకర్తలు, కొందరు నాయకులు కూడా భిన్నంగా ఆలోచిస్తుండడం విశేషమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి