iDreamPost

ప్రచారమే తప్ప ఒరిగిందేమిటి బాబూ…

ప్రచారమే తప్ప ఒరిగిందేమిటి బాబూ…

కేవలం ప్రచారం కోసమే రాజకీయాలు..ప్రచారంతోనే రాజకీయాలు..ప్రచారం మూలంగానే రాజకీయాలు చేస్తున్న, చేయగలిగిన, చేసే నాయకుడు చంద్రబాబు ఒక్కరేమో అనిపిస్తోంది. ఆయన ఏది చేసినా ప్రచారం కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రచారం వస్తే చాలు ఏది చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తోంది.

తాజాగా మహానాడు పేరుతో సాగించిన ప్రహసనం కూడా అందులో భాగమే. పూర్తిగా ప్రచార ఆర్భాటమే తప్ప చంద్రబాబు కి ఒనగూరిన ప్రయోజనం గానీ, టీడీపీకి కలిగిన ప్రయోజనం గానీ ఓ కోశాన కనిపించదు. అయినప్పటికీ రెండు నెలల తర్వాత మళ్లీ అనుకూల మీడియాలో పతాక శీర్షికల కథనాలతో ప్రజల్లో ఉన్నామని చెప్పుకునేందుకు చేసిన ప్రయత్నంగానే ఈ మహానాడు మిగిలిపోతుంది.

మహానాడు అనేది టీడీపీకి వార్షిక మహాసభలనే చెప్పాలి. ఆ సందర్భంగా కనిపించేది సందడి, సందోహం, సంతృప్తి, సంతోషం, అంతా ఇంతా ఉండేది కాదు. కానీ ఈసారి టీడీపీ అధికారం కోల్పోయిన ఆనవాళ్ల నుంచి ఇంకా బయటపడలేదని స్పష్టం అయ్యింది. అందుకుతోడుగా లాక్ డౌన్ ప్రభావం తోడు కావడంతో పూర్తిగా ప్రహసనాన్ని తలపించింది. కేవలం మీడియాలో ప్రచారం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదనే అభిప్రాయం ఆపార్టీ నేతల్లోనే కనిపించింది. చివరకు అనేక మంది నేతలు కూడా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. చివరకు ఎమ్మెల్యేలు కూడా మొఖం చాటేయడం టీడీపీ దుస్థితికి దర్పణం పడుతోంది. కీలక నేతలు నామమాత్రంగా కనిపించడం నైరాశాన్ని నిరూపిస్తోంది.

చంద్రబాబు రెండు రోజుల పాటు పూర్తిగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తన పాలనలో అంతా మంచే జరిగిందనే చెప్పుకునేందుకు ప్రయత్నించడంతోనే సరిపోయింది. వాస్తవానికి బాబు పాలనను ప్రజలు ఆమోదించలేదు. పైగా పూర్తిగా తిరస్కరించినట్టు ఫలితాలు రూడీ చేశాయి. అయినా ఏడాది గడిచినా బాబులో ఏమాత్రం ప్రయాశ్ఛిత్తం లేకపోగా తన పాలన అంతా బాగుందనే భావనలో ఆయన కొనసాగుతుండడం మహానాడులో నిరూపితం అయ్యింది. తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగితే ఎవరికైనా ఉపయోగం ఉంటుందనేది చంద్రబాబుకి తెలియనది కాదు గానీ తన తప్పులను అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు లేదు. పైగా పోలవరం వంటి అంశాలలో తన హయంలో అంతా అయిపోయిందనే భ్రమలను ఇంకా ప్రజల్లో కలిగించేందుకు ఆయన తపన పడుతున్న తీరు మాత్రం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఏపీలో అప్పుల కుప్ప పెరిగిపోయి , ఆర్థిక పరిస్థితి దివాళా దిశలో సాగేందుకు, అభివృద్ధి పూర్తిగా పడకేసి, అవినీతి పెచ్చరిల్లడానికి బాబు పాలన తోడ్పడిందనే అభిప్రాయం ప్రజల్లో చెరిగిపోవడం అంత సులువు కాదు. అయినా చంద్రబాబు వాటిని విస్మరించి నేరం అంతా జగన్ దే అనే సూత్రీకరణలను వీడడం లేదు.

అదే సమయంలో జగన్ పాలనలో ప్రజా సంక్షేమం కొత్త పుంతలు తొక్కుతున్న తీరును గుర్తించడానికి టీడీపీ నేతలు సిద్ధం కావడం లేదు. ప్రత్యర్థి బలాలను అంగీకరించకపోతే దానికి అనుగుణంగా అస్త్రాలు సిద్ధం చేసుకోవడం ఏ యుద్ధరంగంలోనూ సాధ్యం కాదు. రాజకీయాల్లో కూడా అంతేనని చెప్పవచ్చు. జగన్ మార్క్ సంక్షేమం పట్ల జనంలో ఉన్న సంతృప్తిని టీడీపీ జీర్ణం చేసుకోలేకపోతున్నట్టు మహానాడులో ఆపార్టీ నేతల మాటలు, తీర్మానాలు తేటతెల్లం చేస్తున్నాయి. తద్వారా వాస్తవాన్ని అంగీకరించలేని స్థితిలో విపక్షం మునుగిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇది టీడీపీకి ఉపయోగం చేయకపోగా మరింత నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందనే విషయం అందరికీ అర్థమవుతున్నా టీడీపీ అధిష్టానానికి మాత్రం బోధపడడం లేదని మహానాడు రుజువు చేసింది.

మొత్తంగా ప్రచారం మినహా పైసా ప్రయోజనం లేని మహానాడు టీడీపీని కష్టాల నుంచి గట్టెక్కించడానికి తోడ్పడే బదులుగా తమ విధానాలు సరిదిద్దుకోలేనంత లోతుల్లోకి జారిపోతుందా అనే సందేహాలను మరింత బలపరుస్తోందని చెప్పక తప్పదు. దూరమయిన వర్గాలను దగ్గర చేర్చుకునే ప్రయత్నాలు చేయడానికి బదులుగా దూరం పాటించడానికే టీడీపీ సిద్ధమయిపోయిందా అనే అనుమానాలు పెంచుతున్నట్టు రూఢీ అవుతుందని అంతా అనుకోవాల్సి వస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి