Dharani
Dharani
చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. బాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. పవన్ ప్రకటనపై జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోరు తెరిస్తే.. అవినీతిని అంతమొందిస్తాను అనే పవన్ కళ్యాణ్.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతివ్వడమే కాక.. ఏకంగా పొత్తు ఉంటుందని స్పష్టత ఇవ్వడం చూసి ఏపీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం లెక్క పవన్ అని ప్రశ్నిస్తున్నారు.
బాబుకు పవన్ మద్దతు సంగతి పక్కన పెడితే.. ఇక రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు జనసేనకు 40-50 సీట్లు కేటాయిస్తారంటూ ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు అరెస్ట్ కావడంతో.. పరిస్థితి తారుమారయ్యింది. ప్రస్తుతం టీడీపీని ముందుండి నడిపించే బలమైన నేత లేడు. తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత అంత స్ట్రాంగ్ నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. చంద్రబాబు.. బయటకు రాకపోతే.. పవనే ఈ కూటమికి పెద్ద దిక్కు అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
న్యాయనిపుణులు అన్నట్లు.. చంద్రబాబు.. ఆర్నేళ్ల పాటు జైలుకే పరిమితం అయితే.. టీడీపీ, జనసేన కూటమిని పవనే ముందుండి నడిపించాల్సిన పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాంతో పవన్‌ని సీఎం క్యాండెంట్‌గా ప్రకటించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా.. టీడీపీ కార్యకర్తలు మాత్రం బాబు తర్వాత స్థానం చినబాబుదే.. అలాంటప్పుడు.. సీఎం క్యాండెంట్ కూడా లోకేషే అంటు ప్రచారం చేస్తున్నారు. పవన్ పొత్తులు అని చెప్పారు కానీ.. ఇరు పార్టీల కార్యకర్తలు మాత్రం.. అప్పుడే సీఎం కూర్చి మాకంటే మాకని.. సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.