iDreamPost

ఆ సీఈవో “లే ఆఫ్” సరైనదే..

ఆ సీఈవో “లే ఆఫ్” సరైనదే..

సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా పునరుద్ధరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. టాటా గ్రూప్‌ చీఫ్‌గా సైరస్‌ మిస్ర్తీ పునరుద్ధరణకు గత ఏడాది డిసెంబర్‌లో ఎన్‌క్లాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ టాటా సన్స్‌ గ్రూప్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన వారం రోజుల్లోనే ఈ స్టే ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

టాటా సన్స్ చీఫ్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలనే ట్రిబ్యునల్‌ నిర్ణయం మొత్తం లోపభూయిష్టంగా ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే అభివర్ణించారు. కాగా నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌క్లాట్‌) ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాలు చేసిన టాటా గ్రూప్‌ మిస్త్రీ పునర్నియామకం కంపెనీలో వేళ్లూనుకున్న కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలతో పాటు మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని తమ పిటిషన్‌లో పేర్కొంది. సైరస్ మిస్త్రీని టాటా సన్స్‌ చీఫ్‌ గా పునరుద్ధరిస్తూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ తీసుకున​ నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా సన్స్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది.

Read Also: బ్యాంకులు న‌మ్మ‌ద‌గిన‌వేనా?

అయితే సుప్రీం కోర్ట్ మధ్యంతర తీర్పు వెలువడక ముందే సైరస్‌ మిస్త్రీ ఆదివారం ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ‘నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాను. నాకు అనుకూలంగా నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నాకు టాటా సన్స్‌ చైర్మన్‌ హోదా గానీ టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌హోదాపై గానీ ఆసక్తేమీ లేదు. అయితే, బోర్డు లో చోటు సాధించడం సహా మైనారిటీ షేర్‌ హోల్డరుగా హక్కులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని మిస్త్రీ పేర్కొన్నారు.

సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా వ్యవహరించారు. టాటా సన్స్ కి చైర్మన్ గా ఆ పదవిని చేపట్టిన టాటా ల కుటుంబానికి చెందని బయటి వ్యక్తుల్లో నౌరోజీ షక్లత్ వాలా తర్వాత మిస్త్రీ రెండవ వ్యక్తి. వారి తండ్రి పదవి విరమణ చెయ్యడంతో మిస్త్రీ 2006 సెప్టెంబర్ లో టాటా గ్రూప్ లో చేరాడు. టాటా గ్రూప్ లో సంక్షోభం నెలకొన్న తరుణంలో రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా సన్స్ గ్రూప్ బోర్డు డైరెక్టర్లు ఓటింగ్ ద్వారా మిస్త్రిని చైర్మన్ పదవి నుండి తొలగించారు. ఆయన స్థానంలో రతన్ టాటా తిరిగి బోర్డులోకి వచ్చారు. మిస్త్రీ స్థానంలో నటరాజన్ చంద్రశేఖరన్ ని టాటా సన్స్ చైర్మన్ గా నియమించారు. తనని చైర్మన్ పదవి నుండి తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌క్లాట్‌) ని ఆశ్రయించాడు.అయితే 2018 జులై లో ట్రిబ్యునల్‌ తీర్పు మిస్ట్రీకి వ్యతిరేకంగా రావడంతో ఆయన తిరిగి ట్రిబ్యునల్ లో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.

Read Also: జగన్‌ ఆస్తుల కేసు17కు వాయిదా

సైరస్ మిస్త్రీ కి ప్రస్తుతం టాటా గ్రూప్ లో 18.5% వాటా వుంది. వారి కుటుంబానికి ఘనమైన వ్యాపార చరిత్ర వుంది. మిస్త్రీ తాత షాపూర్ జి మిస్త్రీ 1934 లోనే టాటా గ్రూప్ లో వాటాదారుడుగా చేరాడు. ప్రస్తుతం టాటా కుటుంబానికి చెందిన టాటా ట్రస్ట్ కి ఉన్న 66% వాటా తర్వాత ఆ గ్రూప్ లో మిస్త్రీ కుటుంబానికే అత్యధిక వ్యక్తిగత వాటా ఉంది. మిస్త్రీ బొంబాయి లోనే జన్మించినప్పటికీ వ్యాపార రీత్యా ఐర్లాండ్ లో స్థిరపడడంతో ఈయనకి ఐరీష్ పౌరసత్వం ఉంది. లండన్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ లో యంయస్సి పూర్తి చేసిన మిస్త్రీ ప్రస్తుతం ప్రముఖ ఇన్వెస్టమెంట్ మరియు రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆయిన షాపూర్ జీ పల్లోంజీ సంస్థకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి