iDreamPost

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(NRC) అంటే?

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(NRC) అంటే?

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్/జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) – ఈ పదం వినగానే ఎవరికైనా అర్ధమయ్యేది దేశవ్యాప్తంగా ఉన్న అందరి పేర్లు, వివరాలు నమోదు చేసే జాబితా. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి వివరాలు తీసుకుని తయారు చేసే జాబితా లాంటిదే ఇది కూడా అన్నది చాలా మందికి అనిపించే విషయం. కానీ నిజానికి ఇది చాలా భిన్నమైనది, దీని మూలాలు తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలువెనక్కు వెళ్ళాలి.

1951లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తయారు చేసినప్పుడు, అస్సోమ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రతి ఒక్కరి పేరు, వివరాలు నమోదు చేసి ఎన్నార్సీ తయారు చేశారు. ఆ తర్వాత 1979లో అస్సోమ్ రాష్ట్రంలోకి వచ్చిన అక్రమావలసదారుల్ని కనుక్కుని, వారి వారి దేశాలకు పంపించేయాలని కోరుతూ ఆరేళ్ళ పాటు ‘అస్సోమ్ ఫారినర్స్ ఉద్యమం’ జరిగింది. 1985 ఆగష్టు 15న భారత దేశ ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకు – అస్సోమ్ రాష్ట్రంలో నివసిస్తున్న అక్రమావలసదారులెవరో కనుక్కుని తగిన చర్యలు తీసుకునేందుకు కుదిరిన ఒప్పందమే అస్సోమ్ అకార్డ్. ఈ  ఒప్పందం ప్రకారం …
1).1966 జనవరి ఒకటో తేదీ కన్నా ముందు అస్సోమ్ రాష్ట్రంలోకి వచ్చి, 1967 ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్న వారిని భారతీయులు గానే గుర్తించాలి.
2).1966 జనవరి ఒకటో తేదీ తర్వాత, 1971 మార్చి 24 లోపల అస్సోమ్ రాష్ట్రంలోకి సరిహద్దు దేశాల వచ్చిన వారినిని విదేశీయులుగా గుర్తించాలి, వారు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఓటర్ల జాబితాలో కనుక వారి పేరు ఉంటే అవి పది సంవత్సరాల పాటు తొలగించి ఆ తర్వాత చేర్చాలి.

3).1971 మార్చి 25 తర్వాత అస్సోమ్ రాష్ట్రంలోకి సరిహద్దు దేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి, వారిని తిరిగి వారి దేశానికి పంపించాలి.

1985లో  భారతదేశంలో ఏర్పడ్డ ఆర్ధిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యం కావడంతో ఈ అంశం మరుగున పడింది. అస్సోమ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రఫుల్లా కుమార్ మహంత, అస్సోమ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా ఈ ఎన్నార్సీ నవీకరణ అనేది జరగలేదు. 1990ల్లో భారతదేశంలో ఏర్పడ్డ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడి పరిస్థితి కుదుటపడే సమయానికి మళ్ళీ 1999లో అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నార్సీ అంశం తెర మీదకు వచ్చింది.

ఆ తర్వాత 2003 లో పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరిస్తూ ఈ కింది నిర్ణయాలి తీసుకుంది.
a).1950 నుంచి 1987 మధ్యలో భారతదేశంలో పుట్టిన వారెవరైనా సరే భారతీయ పౌరులుగా గుర్తించబడతారు.
b).1987 నుంచి 2003 మధ్యలో భారతదేశంలో పుట్టిన వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారత దేశానికి చెందిన వారైతే చాలు – ఆ పిల్లలు భారతీయ పౌరులుగా గుర్తించబడతారు.
c).2004 తర్వాత భారతదేశంలో పుట్టిన వారి తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారులైతే వారి పిల్లలకు భారతదేశ పౌరసత్వం లభించదు.

ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ ఎన్నార్సీ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. కొన్ని సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు 2013లో అస్సామ్ లో ఎన్నార్సీని నవీకరించాలని తీర్పు ఇచ్చింది.

అస్సోమ్ రాష్ట్రంలో చేపట్టిన ఎన్నార్సీలో ప్రజలు వారి పేర్లు నమోదు చేసుకోవాలంటే – తమ లేదా తమ పూర్వీకుల పేరు మీద 1971 మార్చి 24 అర్ధరాత్రికి ముందర ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ద్వారా జారీ చేయబడ్డ పధ్నాలుగు రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి.

వేరే ప్రాంతాలకు వెళ్లిన వివాహితలైతే ఈ పధ్నాలుగిట్లో ఒక పత్రంతో పాటు 1971 మార్చి 24 అర్ధరాత్రికి ముందు సర్కిల్ ఆఫీసర్ లేదా గ్రామ పంచాయితీ కార్యదర్శి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కానీ రేషన్ కార్డు కానీ జత చేస్తేనే వారి ధ్రువీకరణ పత్రాలు చెల్లుతాయి. ఈ పధ్నాలుగు రకాల ధ్రువీకరణ పత్రాలు తమ పేరుతొ కాకుండా తమ పూర్వీకుల పేరు మీద ఉన్నట్లైతే వారితో తమ బంధుత్వాన్ని ధృవీకరించే మరో ఎనిమిది రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారి పేర్లు మాత్రమే ఎన్నార్సీలో చేర్చాలి.

మూడు కోట్ల జనాభా ఉన్న అస్సోమ్ రాష్ట్రంలో ఈ ఎన్నార్సీ ప్రక్రియ ఆరేళ్ళ పాటు సాగింది. ఆగష్టు నెలాఖరులో విడుదల చేసిన ఈ పత్రాలు సమర్పించలేక తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయిన వారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఆ నలభై లక్షల మంది పేర్లను ఎన్నార్సీలో చేర్చే విషయంపైన పునఃసమీక్ష చేయాలని సెప్టెంబర్లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును దృష్టిలో పెట్టుకుని ముందుగా చెప్పిన ధ్రువీకరణ పత్రాల్లోని అయిదు రకాల పత్రాలను తీసేసి మిగిలిన పదిలో ఏదైనా సమర్పించవచ్చని ప్రభుత్వం ఈ ప్రక్రియను కొంచెం సడలించింది. అలా మరికొందరు తమ వద్దనున్న పత్రాలు సమర్పించి కొందరు బయటపడినప్పటికీ కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.

ఒక ఉదాహరణ :

అస్సామ్ లోని కామ్రుప్ జిల్లాలో మక్బూల్ అలీ, రహీమున్నీసా దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు, అతని పేరు అజ్మల్ హక్ , అతను పెరిగి పెద్ద వాడయ్యి 1986లో మెకానికల్ ఇంజినీర్ గా భారత సైన్యంలో ఉద్యోగంలో చేరాడు. 2003 లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా నియమించారు. 2016 దాకా ఆ పదవిలో కొనసాగిన అజ్మల్ 2016లో పదవీ విరమణ చేశాడు. 2017 అక్టోబర్లో అజ్మల్ కు – తాను బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత భారతదేశానికి వచ్చిన అక్రమ వలసదారుడని, తన భారతదేశ పౌరసత్వాన్ని నిరూపించే ధ్రువీకరణ పత్రాలతో తమ ముందు హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఫారినర్స్ ట్రిబ్యునల్ నుంచి సమన్లు అందాయి. 2012 లో అజ్మల్ భారత సైన్యంలో ఉద్యోగిగా ఉన్నప్పుడే తన భార్య ముంతాజ్ బేగం కూడా తన పౌరసత్వాన్ని నిరూపించుకోడానికి ఫారినర్స్ ట్రిబ్యునల్ ముందు హాజరయ్యి, ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు.

1961 లో అజ్మల్ తండ్రి మక్బూల్ అలీ పేరు తమ గ్రామంలో చేసిన సర్వేల్లో, 1966 ఓటర్ల లిస్టులో నమోదు కాబడి ఉంది, అతని పేరు మీద 1963 నాటి భూమి పట్టా ఒకటి ఉంది, అతని భార్య రహిమున్నీసా పేరు 1951 నాటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)లో నమోదు కాబడి ఉంది. అజ్మల్ తరఫు న్యాయవాది కొన్ని ధ్రువీకరణ పత్రాలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2017 మే నెలలో అజ్మల్ ఒక బ్యాంకుకు సంబంధించిన సేవలందించే కేంద్రం ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు అస్సామ్ పోలీస్ అధికారులు అజ్మల్ కు సంబంధించిన అన్ని వివరాలు పరిశీలించి, ధృవీకరించారు.

2018 మే లో విడుదల చేసిన అస్సామ్ ఎన్నార్సీలో గల్లంతైన నలభై లక్షల మంది పేర్లలో అజ్మల్ హక్ పేరు, తన కొడుకు, కూతురి పేర్లు కూడా ఉన్నాయి, మూడు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలందించిన అజ్మల్ దాన్ని తీవ్ర అవమానంగా భావించారు. అజ్మల్ ట్రిబ్యునల్ నుంచి సమన్లు అందినప్పుడే వేదనకు గురై భారత ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, కేంద్ర ప్రభుత్వాన్ని “భారతదేశ పౌరసత్వం పేరుతో ఇలా వేధింపులకు గురి చేయకండి” అని

వేడుకుంటూ తన ట్విట్టర్ ఖాతాలో వీడియో ఒకటి పోస్ట్ చేశారు.

పైన చెప్పిన యదార్ధ సంఘటనలో – అజ్మల్, అతని పూర్వీకులు కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలోనే ఉన్నారు – అజ్మల్ చదువుకున్న వ్యక్తి, మాజీ సైన్యాధికారి – కనుక తన పూర్వీకుల ధ్రువీకరణ పత్రాలు భద్రపరుచుకున్నారో, లేక సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించి సంపాదించారో అప్రస్తుతం. మూడు దశాబ్దాల పాటు సైన్యంలో పని చేసిన అజ్మల్ కు వచ్చిన పరిస్థితే దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడ్డ సామాన్యులకు ఎదురైతే ?

1971 సంవత్సరం ముందు నుంచీ వారు, వారి పూర్వీకులు ఈ దేశంలోనే ఉన్నారని రుజువు చేసుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేని పక్షంలోవారి పరిస్థితి ఏమిటి ? అందుకు కూడా మన కళ్ళ ముందే కనిపించిన మరో ఉదాహరణ – భారతదేశ సైన్యంలోనే మూడు దశాబ్దాల పాటు యుద్ధరంగంలో సేవలందించిన మొహమ్మద్ సనావుల్లా.

1971 కన్నా ముందు నుంచీ తాను, తన పూర్వీకులు ఈ దేశస్థులేనని రుజువు చేసుకోలేకపోయినందుకు డిటెన్షన్ సెంటర్ కు పంపబడ్డారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఎన్నార్సీలో గల్లంతయ్యాయనే విషయం తెలిసిన వారు కూడా ఎన్నార్సీని సమర్ధిస్తే ఆశ్చర్యకరమే !

ఉన్నత అధికారులుగా పని చేసిన వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులు సైతం తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఇబ్బంది పడేంత క్లిష్టతరమైన ప్రక్రియ ఎన్నార్సీ. ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి ?ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలకు సరిగ్గా అర్ధం కూడా తెలియని ఎందరో పేదవారు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు, ప్రకృతీ వైపరీత్యాల కారణంగా సర్వం కోల్పోయినవారు, ఇలా ఎందరో ఉంటారు – వారందరినీ ఈ దేశం నుంచి ఇప్పుడు తరిమేయాలా అనే ప్రశ్నకు సమాధానమేంటి ?

To be continued … 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి