iDreamPost

సూపర్-8 గండాన్ని దాటిన ఇంగ్లండ్.. అంతా ఆసీస్ చలవే!

  • Published Jun 16, 2024 | 11:00 AMUpdated Jun 16, 2024 | 11:00 AM

ఇంగ్లండ్​ జట్టు అనుకున్నది సాధించింది. అయితే ఆ టీమ్ ఆస్ట్రేలియాకు రుణపడి ఉంటుందనే చెప్పాలి. కంగారూల వల్ల సూపర్-8 గండాన్ని దాటింది ఇంగ్లీష్​ టీమ్.

ఇంగ్లండ్​ జట్టు అనుకున్నది సాధించింది. అయితే ఆ టీమ్ ఆస్ట్రేలియాకు రుణపడి ఉంటుందనే చెప్పాలి. కంగారూల వల్ల సూపర్-8 గండాన్ని దాటింది ఇంగ్లీష్​ టీమ్.

  • Published Jun 16, 2024 | 11:00 AMUpdated Jun 16, 2024 | 11:00 AM
సూపర్-8 గండాన్ని దాటిన ఇంగ్లండ్.. అంతా ఆసీస్ చలవే!

స్కాట్లాండ్.. టీ20 వరల్డ్ కప్​-2024లో అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మెగాటోర్నీలోకి అడుగుపెట్టిన ఈ టీమ్.. వరుసగా నమీబియా, ఒమన్​పై ఘనవిజయాలు సాధించింది. ఇంగ్లండ్​తో జరగాల్సిన మొదటి మ్యాచ్​ వర్షం వల్ల సాధ్యపడలేదు. అందులో కూడా ఆడిన 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది. ఆ తర్వాతి మ్యాచుల్లో నమీబియా, ఒమన్​ను చిత్తు చేసింది. దీంతో స్కాట్లాండ్ సూపర్-8 చేరడం పక్కా అని అంతా అనుకున్నారు. మరోవైపు ఇదే గ్రూపులో ఉన్న ఆస్ట్రేలియా అప్పటికే సూపర్ పోరుకు అర్హత సాధించడంతో.. ఇక, ఇంగ్లండ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ఆసీస్​తో జరిగే ఆఖరి మ్యాచ్​లో స్కాట్లాండ్ గెలిస్తే ఇంగ్లీష్ టీమ్ ఇంటికేనని ఫిక్స్ అయ్యారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ఓడినా మంచి రన్​రేట్ ఉంటే స్కాట్లాండ్ సూపర్-8 చేరే ఛాన్స్ ఉండటంతో ఇంగ్లండ్ ఖేల్​ఖతం అని అందరూ అనుకున్నారు. అయితే ఆసీస్ పుణ్యమాని సూపర్ పోరుకు అర్హత సాధించింది ఇంగ్లీష్ టీమ్. స్కాట్లాండ్​తో ఇవాళ ఉదయం జరిగిన మ్యాచ్​లో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రెండన్ మెక్​ముల్లెన్ (34 బంతుల్లో 60), రిచ్ బెర్రింగ్టన్ (31 బంతుల్లో 42 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్​తో టీమ్​కు మంచి స్కోరు అందించారు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆసీస్.. ఒక దశలో 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మార్కస్ స్టొయినిస్ (29 బంతుల్లో 59) విన్నింగ్ నాక్​తో టీమ్​ను విజయతీరాలకు చేర్చాడు.

ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 24 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్​తో స్కాట్లాండ్​ను వణికించాడు. అంతకుముందు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 బంతుల్లో 68) అపోజిషన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత స్టొయినిస్ రాణించినా మ్యాచ్ లాస్ట్ ఓవర్​కు వెళ్లింది. అయితే డేవిడ్ నిలబడి పోరాడి ఇంకో రెండు బంతులు ఉండగానే టీమ్​కు విక్టరీ అందించాడు. స్టొయినిస్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కీలక మ్యాచ్​లో స్కాట్లాండ్ ఓటమితో ఇంగ్లండ్ సూపర్-8కు చేరింది. గ్రూప్-బీలో ఈ రెండు జట్లు సమానమైన పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్​రేట్ కారణంగా ఇంగ్లీష్ టీమ్ నెక్స్ట్ స్టేజ్​కు చేరింది. ఆసీస్ గనుక ఓడిపోతే ఆ జట్టు ఇంటిదారి పట్టేది. అయితే సూపర్-8కు చేరుకోకపోయినా అద్భుతమైన ఆటతీరు, పోరాట పటిమతో అందరి హృదయాలు గెలుచుకుంది స్కాట్లాండ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి