iDreamPost

సీరీస్ మనదే

సీరీస్ మనదే

పూణే వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత్ 78 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తో కైవసం చేసుకుంది.భారత్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్ లో ఓపెనర్ గుణ తిలక అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే అవిష్కా ఫెర్నాండో అవుట్ అవ్వగా, నాలుగో ఓవర్లో ఫెర్నాండో రన్నవుట్ గా వెనుదిరిగాడు. 24 పరుగుల వద్ద ఫామ్ లో ఉన్న కుశాల్ పెరీరా కూడా అవుట్ అవటంతో నాలుగు వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది.ఈ దశలో సీనియర్ ఆల్రౌండర్ మ్యాథ్యూస్ తో కలిసి ధనుంజయ డిసిల్వా మరో వికెట్ పడకుండా భారత బౌలర్లను కొద్దిసేపు సమర్థవంతంగా ఎదుర్కొని ఐదో వికెట్కు 68 పరుగులు జోడించారు. 31 పరుగులు చేసిన మ్యాథ్యూస్ అవుటైన వెంటనే మిగిలిన శ్రీలంక బ్యాట్స్మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టగా 31 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న ధనుంజయ డిసిల్వా(57) ఒంటరి పోరాటం 122 పరుగుల వద్ద ముగిసిన వెంటనే మలింగా కూడా పెవిలియన్ బాట పట్టడంతో 123 పరుగుల వద్ద 15.5 ఓవర్లలో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.

గత మ్యాచ్లో వేగము,వైవిధ్యంతో ఆకట్టుకున్న భారత యువ ఫేస్ బౌలర్లు ఈ మ్యాచ్లో కూడా రాణించి నవదీప్ షైనీ మూడు వికెట్లు పడగొట్టగా,శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు.

అర్థ సెంచరీలతో రాణించిన భారత ఓపెనర్లు:

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనర్లు ప్రపంచ కప్పు జట్టులో స్థానమే లక్ష్యంగా చెలరేగిపోయారు.రాహుల్ (54),శిఖర్ ధావన్(52) సరిగ్గా 36 బంతులు ఆడి,అర్థ సెంచరీలు పూర్తి చేసిన తర్వాత వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో అవుట్ అయ్యారు.గత కొంతకాలంగా జట్టుతో కొనసాగుతున్న కేరళ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్లో తుది జట్టులో స్థానం లభించింది.కెప్టెన్ కోహ్లీ ఈ యువ ఆటగాడిని పరీక్షించే ఉద్దేశంతో మూడో స్థానంలో తన బదులు బ్యాటింగ్ అవకాశం కల్పించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేదు.అంతర్జాతీయ మ్యాచ్ లో తన తొలి బంతిని సిక్సర్ గా సంజు మలిచ్చినప్పటికీ వెంటనే స్పిన్నర్ హసరంగా బౌలింగులో లోపలికి దూసుకొని వచ్చిన బంతికి ఎల్బిడబ్ల్యు గా వెనుదిరిగాడు.

12 ఓవర్లలో రెండు వికెట్లు పడటంతో నాలుగో స్థానంలో గత రెండు సిరీస్ లనుండి రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చి ఒక ఫోర్ కొట్టి తర్వాత బంతికే కాట్ అండ్ బోల్డ్ గా అవుటయ్యాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మనీష్ పాండే, విరాట్ కోహ్లీలు నిలకడగా ఆడి ఐదో వికెట్కు 44 పరుగులు జోడించారు. ఈ సమయంలో 26 పరుగులు చేసిన కోహ్లీ నిష్క్రమించగా తర్వాత బంతికే వాషింగ్టన్ సుందర్ డకౌట్ అవుటయ్యాడు.

స్లాగ్ ఓవర్లలో రెచ్చిపోయిన ఠాకూర్ :

రెండో టీ20 మ్యాచ్లో స్వింగ్, షార్ట్ పిచ్ బంతులతో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసుకుని బౌలర్ గా ఆకట్టుకున్న శార్ధూల్ ఠాకూర్ 8 బంతులలో రెండు సిక్స్లు,ఫోర్లతో 22 పరుగులు సాధించాడు.లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్కు దిగిన మనీష్ పాండే(31 నాటౌట్ ),ఠాకూర్(22 నాటౌట్) తో కలిసి చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు జోడించి జట్టు స్కోరు 200 పరుగులు దాటించారు.వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ తో ఎవరు ఊహించని విధముగా ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు భారత జట్టు చేసింది.ఓవర్ కు 10 పరుగుల పైగా సగటుతో 202 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంకకు భారత్ నిర్దేశించింది.లంక బౌలర్లలో స్పిన్నర్ సందకన్ బౌలింగ్ లో రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు.

కొత్త ఏడాదిని సిరీస్ విజయంతో మొదలుపెట్టిన భారత్:

మూడు మ్యాచ్ల టి-20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా,ఇండోర్ లో జరిగిన రెండో టి-20 మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన భారత్, ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించడంతో శ్రీలంకపై 17వ ద్వై పాక్షిక సిరీస్ ను గెలుపొందింది.కొత్త ఏడాదిని భారత జట్టు సిరీస్ విజయంతో మొదలు పెట్టి అభిమానులలో ఆనందోత్సవాలు నింపింది.భారత యువ ఫేస్ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్,నవదీప్ సైనీ కు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు దక్కాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి