iDreamPost

చందు సత్యల స్వీట్ ‘క్షణం’ – Nostalgia

చందు సత్యల స్వీట్ ‘క్షణం’ – Nostalgia

తెలుగు సినిమా ప్రస్థానంలో వర్మ పేరుకో ప్రత్యేకమైన పేజీ ఉంది. ఇప్పుడెలాంటివి తీస్తున్నాడన్నది పక్కన పెడితే శివతో ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మాత్రం వర్మనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1989లో శివ రిలీజైనప్పుడు ఎవరీ కుర్రాడని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. తమకూ అలాంటి సినిమా తీసిపెట్టామని బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు క్యూలు కట్టారు. కానీ శివ హిందీ రీమేక్ తర్వాత కొంత టైం తీసుకున్న వర్మ వెంకటేష్-శ్రీదేవి ఫస్ట్ టైం కాంబినేషన్ తో క్షణ క్షణంకు శ్రీకారం చుట్టాడు.

అప్పటిదాకా టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేని క్రైమ్ థ్రిల్లర్ ని స్టార్ హీరోతో చేయడం పట్ల అప్పట్లో చాలా చర్చే జరిగింది. ఇంత మంచి కాంబోని సెట్ చేసుకుని వర్మ కమర్షియల్ ప్రాజెక్ట్ చేయకుండా అనవసరంగా రిస్క్ తీసుకున్నాడని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. కానీ వర్మ అవేవి కేర్ చేయలేదు. క్షణ క్షణం తాను శ్రీదేవికి రాసిన వెండితెర ప్రేమలేఖని పబ్లిక్ గా చెప్పుకోవడం వర్మకే చెల్లింది. ఇక్కడ చూస్తున్న పిక్ హీరో హీరోయిన్ మొదటిసారి కలుసుకునే సన్నివేశంలోనిది. అనుకోకుండా ఓ మర్డర్ కేస్ లో ఇరుక్కున్న శ్రీదేవి అలియాస్ సత్య తన ఫ్లాట్ నుంచి తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేయడం కోసం ఓ కేఫ్ కు వస్తుంది. అదే సమయంతో చిల్లర మోసాలతో పబ్బం గడుపుకునే వెంకటేష్ ఉరఫ్ చందు టీ తాగడానికి అక్కడికే వస్తాడు.

అక్కడ ఓ రౌడీ మూక శ్రీదేవిని అటకాయిస్తుంది. వెంకీ కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా పోలీసులు వస్తారు. తనకోసం వచ్చారనుకున్న చందు వెంటనే సత్య మెడపై కత్తి పెట్టి తప్పించుకునే ప్లాన్ వేస్తాడు. మర్డర్ కేసులో తనను అరెస్ట్ చేయడానికి వచ్చారనుకున్న సత్య ఎక్కువ గొడవ చేయకుండా చందుతో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇలాంటి సినిమాలో శ్రీదేవి, వెంకటేష్ లు మొదటిసారి కలుసుకునే సీన్ ఈ టైపు లో ప్లాన్ చేయడం వర్మ శైలికి నిదర్శనం. కీరవాణి సంగీతం, గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం క్షణక్షణంని టెక్నికల్ గా ఉన్నత స్థాయిలో నిలిపాయి. అధిక శాతం అడవిలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలు తక్కువగా ఉన్నా ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకుండా చూసుకున్నాడు వర్మ. శివ స్థాయిలో క్షణక్షణం చరిత్ర సృష్టించలేదు కానీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ చెప్పిన క్షణాలు లాంటివి ఈ సినిమాలో బోలెడున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి