iDreamPost

సుశాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గిఫ్ట్

సుశాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గిఫ్ట్

ఇటీవలే అనూహ్య పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జ్ఞాపకాల నుంచి ప్రేక్షకులు ఇంకా పూర్తిగా బయటికి రావడం లేదు. సోషల్ మీడియాలో ఇతని గొప్పదనాన్ని చాటే వీడియోలు బయటికి రావడంతో ఇంత చిన్న వయసులో కాలం చేయడం గురించి బాధ పడని సినీ ప్రేమికులు లేరు. మరోవైపు సుశాంత్ మరణానికి కొందరు ఇండస్ట్రీ పెద్దలే కారణమంటూ పలువురు బహిరంగంగానే మీడియా ముందుకు రావడంతో కొంత వివాదం కూడా చెలరేగింది. చేతికి వచ్చిన 7 సినిమాల ఆఫర్లను వెనక్కు లాగేసుకునేలా వీళ్ళు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. ఏది ఎలా ఉన్నా పోయిన ప్రాణం వెనక్కు తిరిగి తీసుకురాలేం కాని ఈ విషాదంలోనూ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందించింది డిస్నీ హాట్ స్టార్ సంస్థ.

సుశాంత్ ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’ను వచ్చే నెల అంటే జూలై 24 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఇక్కడే మరో విశేషం కూడా ఉంది. ఈ సినిమాను సదరు యాప్ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు ఎవరైనా ఉచితంగా చూడొచ్చట. అంటే జస్ట్ లాగిన్ అయిపోయి మన డీటెయిల్స్ ఇస్తే చాలు ఫ్రీగా చూసేయోచ్చు. ఇది నిజంగా గొప్ప కానుక. దిల్ బేచారాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సంజనా సంఘీ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. దీని షూటింగ్ రెండేళ్ల క్రితమే మొదలైనా దర్శకుడు ముఖేష్ చాబ్రా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడంతో ఆలస్యం అయ్యింది. తర్వాత ఆయన నిరపరాధిగా ఋజువు కావడంతో మిగిలిన భాగం సాఫీగా పూర్తి చేశారు.

మరో ప్రధాన ఆకర్షణ ఏఆర్ రెహమాన్ సంగీతం. దీన్ని థియేటర్లలోనే చూసి సుశాంత్ కు ఘన నివాళి ఇద్దామని రెహమాన్ కొద్దిరోజుల క్రితమే పిలుపిచ్చారు. అయితే అప్పటికే ఓటిటి డీల్ జరిగిపోవడంతో ఎవరూ ఏమి చేయలేని నిస్సహాయత. ఎప్పటికీ తిరిగి రాని సుశాంత్ చివరి చిత్రాన్ని ఇంట్లోనే ఉచితంగా చూసే వెసులుబాటు కలిగించినందుకు మూవీ లవర్స్ హాట్ స్టార్ కు థాంక్స్ చెబుతున్నారు. కోట్లు పోసి కొన్న సినిమాను చందాదారులు కానివాళ్లకు కూడా చూపిస్తున్నారు అంటే మంచి విషయమేగా. అయితే ఇంకో నెల రోజులు వేచి చూడక తప్పదు. రామ్ కామ్ జానర్ లో రూపొందిన దిల్ బేచారా మీద మంచి అంచనాలే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి