iDreamPost

కోవిడ్ బారిన పడ్డవారికి గుండె జబ్బుల రిస్కు ఎక్కువే: అమెరికన్ స్టడీ

కోవిడ్ బారిన పడ్డవారికి గుండె జబ్బుల రిస్కు ఎక్కువే: అమెరికన్ స్టడీ

కోవిడ్ తీవ్రంగా అటాక్ అయి తగ్గిపోయిన ఏడాది దాకా గుండెకు ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్-19 బారిన పడ్డవారిలో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటి 20 రకాల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిందని ఓ అమెరికన్ స్టడీ తేల్చింది. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించిన వారిలోనూ ఈ రిస్కు కనిపిస్తుందని స్టడీ చెబుతోంది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు అమెరికన్ వెటరన్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ నుంచి తీసుకున్న డేటాని విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించారు. ఈ స్టడీని కొన్ని సర్వేలు సమర్థించగా మరికొన్ని మాత్రం గుండెకు పెద్దగా రిస్కు లేదని చెబుతున్నాయి.

అసలేంటీ స్టడీ?

కోవిడ్ సమయంలో చాలా మందికి గుండె సంబంధిత సమస్యలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే అమెరికన్ స్టడీ వివరాలు వెల్లడయ్యాక దీనిపై ఆందోళన తీవ్రమైంది. జియాద్ అల్ అలీ అనే ఎపిడెమాలజిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో కోవిడ్-19 సోకి ప్రమాదకర స్థాయి దాకా వెళ్ళి కోలుకున్న వాళ్ళ గుండె, రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చే మార్పులను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోవిడ్ తీవ్ర దశ చూసొచ్చిన లక్షా పదిహేను వేల పై చిలుకు వృద్ధులను కోవిడ్ సోకని వృద్ధులతో పోల్చి చేశారు. అలాగే కోవిడ్ పిరియడ్ కంటే ముందరి కొన్ని శాంపిల్స్ కూడా పరిశీలించారు. చివరికి కోవిడ్ బారిన పడి ఐసీయూలో చేరిన వాళ్ళకు తర్వాతి ఏడాది దాకా గుండె జబ్బుల రిస్కు చాలా ఎక్కువగా ఉంటుందని తేల్చారు.

 

గుండెకు ఎంత రిస్కు?

గుండె ఉబ్బడం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం లాంటి కొన్ని తీవ్రమైన సమస్యలు 20 శాతం పెరిగినట్లు ఈ అధ్యయనం చెబుతోంది. అయితే కోవిడ్ అటాకై హాస్పిటల్ లో చేరని వాళ్ళలోనూ హార్ట్ ఎటాక్ రిస్కు 8% పెరిగినట్లు తెలుస్తోంది. గుండె మంట లాంటి సమస్యలు ఏకంగా 247% పెరిగాయని ఈ స్టడీలో తేలింది. కోవిడ్ సోకిన తర్వాత కొందరి ఆరోగ్యం పూర్తిగా మారిపోతుందని అల్ అలీ తన అంచనా వేశారు. దీన్ని లాంగ్ కోవిడ్ గా చెప్పుకోవచ్చు.

ఇతర సమస్యలేంటి?

కరోనా వైరస్ సోకిన తర్వాత డయాబెటిస్, ఊపిరితిత్తులు పాడైపోవడం, మెదడు సంబంధిత సమస్యలు ఎక్కువైనట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటికి గుండె సంబంధిత సమస్యలు తోడైతే రానురాను మనిషి జీవన ప్రమాణం తగ్గిపోతుందని అల్ అలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు చికిత్స ఉన్నా పూర్తిగా నయం కావని చెబుతున్నారు.

స్టడీపై మిశ్రమ స్పందన

అల్ అలీ టీం నిర్వహించిన అధ్యయనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులతో పాటు అన్ని వర్గాలకు చెందిన యువకులను కూడా శాంపిల్ లో చేర్చాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ఫలితాలు ఇంకా కచ్చితంగా వచ్చేవంటున్నారు. అయితే ఇంగ్లండులో జరిగిన కొన్ని సర్వేల్లో వచ్చిన ఫలితాలు అమెరికన్ సర్వేకి దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ సోకినవాళ్ళలో గుండెజబ్బుల రిస్కు ఎక్కువేనని ఇవి తేల్చాయి.

గుండె జబ్బులకు కారణాలేంటి?

కోవిడ్ టైంలో ఒక్కరే ఐసోలేషన్ లో ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలొచ్చినా హాస్పిటల్ కి వెళ్ళలేకపోవడం, ఒత్తిడి లాంటి కారణాల వల్లే గుండె జబ్బుల శాతం పెరిగి ఉండవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తగా ఉండడమే మేలు!

ఎవరికి గుండె జబ్బుల రిస్కు ఎక్కువగా ఉంది? రిస్కు ఎంత కాలం ఉంటుంది? ఏ కారణాల వల్ల గుండెకు రిస్కుంటుంది అనే అంశాలపై ఇంకా విస్తృతంగా అధ్యయనం జరుగుతోంది. పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ కోవిడ్ బారిన పడ్డవాళ్ళు జాగ్రత్తగా ఉండడమే మేలని డాక్టర్లు సలహా ఇస్తున్నరు. వృద్ధులైన కోవిడ్ బాధితులకు గుండె సంబంధిత పరీక్షలు చేయాలని అమెరికాకు చెందిన కార్డియాలజీ నిపుణుల బృందం డాక్టర్లకు సూచిస్తోంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి