iDreamPost

కాపురాలు చక్కదిద్దిన స్టేషన్ పెద్ద – Nostalgia

కాపురాలు చక్కదిద్దిన స్టేషన్ పెద్ద – Nostalgia

అనుకుంటాం కానీ సెంటిమెంట్ సినిమాలు డీల్ చేయడం అంత సులభం కాదు. అందులోనూ ఇద్దరేసి హీరోలను పెట్టి డ్రామాను పండించడం అంటే కత్తి మీద సామే. అన్ని కరెక్ట్ గా కుదిరితే సూపర్ హిట్ ఖాయం. అలాంటి ఓ చక్కని ఉదాహరణే స్టేషన్ మాస్టర్. 1988 సంవత్సరం. మాస్ చిత్రాలు రాజ్యమేలుతున్న ట్రెండ్ అది. దర్శకులు కోడి రామకృష్ణ అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా నలుగురితోనూ సూపర్ హిట్స్ ఇచ్చి మంచి ఫామ్ లో ఉన్నారు. తలంబ్రాలు, ఆహుతి లాంటి సీరియస్ ఎంటర్ టైనర్లు చాలా పేరు తీసుకొచ్చాయి. ఈ టైంలో కోడి రామకృష్ణగారికి భార్యాభర్తల బంధం మీద చిత్రం తీయాలన్న ఆలోచన వచ్చింది

అప్పటికాయనకు నటులు రావు గోపాల్ రావుతో చక్కని అనుబంధం ఉంది. ఎంతసేపు తనను విలన్ గా చూపిస్తున్నారు తప్ప అసలైన యాక్టర్ ని బయటికి తీసుకొచ్చే ఎమోషనల్ సబ్జెక్టు ఎవరూ చెప్పడం లేదని చెప్పడంతో కోడి గారు ఆలోచనలో పడ్డారు. రావు గారే చెప్పిన ఒక చిన్న ఐడియాను రచయిత గణేష్ పాత్రోతో కలిసి ఒక మంచి కథగా రూపొందించి దాన్నే స్టేషన్ మాస్టర్ గా నామకరణం చేసి వినిపించారు. ఒక్క సిటింగ్ లోనే స్క్రిప్ట్ బ్రహ్మాండంగా నచ్చింది. తనదే టైటిల్ రోల్ కాబట్టి నిర్మాతగా అంతకన్నా తనకు కావాల్సింది ఏముందని రావుగోపాల్ రావు సంతోషం పచ్చజెండా ఊపేశారు.

మాస్ ఇమేజ్ లేని ఇద్దరు హీరోలైతే న్యాయం చేయగలరని రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లను ఎంచుకున్నారు. జీవిత, అశ్వని హీరోయిన్లు. స్వరాలు చక్రవర్తి, విజయ్ ఛాయాగ్రహణం అందించారు. ఇద్దరు నిరుద్యోగులైన యువకులు ఒక స్టేషన్ మాస్టర్ పంచన చేరతారు. ఆయన వాళ్ళను దత్తత తీసుకుని పెళ్లిళ్లు కూడా చేస్తాడు. అయితే వచ్చిన కోడళ్ల వల్ల ఊహించని కలతలు ఆ కుటుంబంలో ఏర్పడతాయి. చివరికి ఆ మాస్టరే వాళ్ళ కాపురాన్ని ఎలా చక్కదిద్దారనేదే ఇందులో మెయిన్ పాయింట్. 1988 మార్చి 4వ తేదీ చిరంజీవి రుద్రవీణతో అదే రోజు పోటీ పడి మరీ స్టేషన్ మాస్టర్ సూపర్ హిట్ కావడం గొప్ప విశేషం. మ్యూజికల్ గానూ దీని ఆడియో మంచి స్పందన దక్కించుకుని ఆ ఏడాది టాప్ ఆల్బమ్స్ లో చోటు దక్కించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి