iDreamPost

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో దేశంలో క్రికెట్ మళ్ళీ ఆరంభించండి-సునీల్ జోషి

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో దేశంలో క్రికెట్ మళ్ళీ ఆరంభించండి-సునీల్ జోషి

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించిన తర్వాత క్రికెట్ సీజన్‌ను భారతదేశ ప్రధాన దేశీయ టీ-20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో బీసీసీఐ ప్రారంభించాలని భారత క్రికెట్ టీం చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి కోరుతున్నాడు.దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా బీసీసీఐ రెండుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను వాయిదా వేయవలసి వచ్చింది, అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే సెప్టెంబర్ లేదా అక్టోబరులో క్రేజీ ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని క్రికెట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దేశవాళీ టీ-20 టోర్నీ నిర్వహించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన లీగ్ టోర్నీ ఐపిఎల్‌కు ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్ లభించి సిద్ధపడే అవకాశం ఉంటుందని సునీల్ జోషి భావిస్తున్నాడు.దీంతో తాజాగా ఆయన తన తోటి సెలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఐపిఎల్‌కు ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం గురించి చర్చించారు.
చీఫ్ సెలెక్టర్ సూచనలను బిసిసిఐ అంగీకరిస్తే పరిమిత ఓవర్ల జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనికి కూడా టీ-20 టోర్నమెంట్‌లో తన బ్యాటింగ్ ప్రదర్శించడానికి అవకాశం దక్కుతుంది. ఏదేమైనా దేశంలో మూడవ దశ లాక్ డౌన్ మే 17న ముగిసిన తర్వాతనే బీసీసీఐ సమావేశమై సెలక్టర్ల సూచనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల బిజీ షెడ్యూల్ కారణంగా భారత క్రికెట్ జట్టు సభ్యులు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆడటం లేదు. కానీ మూడు నెలలకు పైగా విరామం తర్వాత మైదానంలోకి అడుగు పెట్టాల్సి రావడంతో క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం ఆయా రాష్ట్రాల తరుపున ఆడవలసిన అవసరం ఏర్పడింది. ఒకవేళ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ తరుపున ఈ టోర్నీలో ఆడితే సుమారు 7 ఏళ్ల విరామం తర్వాత అతను దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్నట్లు లెక్క. చివరిసారిగా అతను 2013లో ఎన్‌కెపి సాల్వే ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి