iDreamPost

కులం కోణంలో శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌!

కులం కోణంలో శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌!

కులం, మ‌న దేశంలో ఇది చాలా పెద్ద ప‌దం. క‌నిపిస్తూ వుంటుంది, క‌న‌ప‌డ‌న‌ట్టు వుంటుంది. ఒక‌ప్పుడు ప‌ల్లెల్లో కులాల పేర్ల‌తోనే పిలిచేవాళ్లు. మాదిగ రాముడు, బోయ భీముడు అదే అగ్ర‌కులాల‌కి గారు అని చేర్చే వాళ్లు. కుల వివ‌క్ష‌ని శ‌తాబ్దాలుగా మోస్తున్న జాతి మ‌న‌ది. ఒక‌ప్పుడు వృత్తుల ఆధారంగా కులాలు ఏర్ప‌డ్డాయి. పాల‌కులు అగ్ర‌కులాలుగా , శ్రామికులు చిన్న కులాలుగా ఒక కుట్ర ప్ర‌కారం ఏర్ప‌డిపోయారు.

మ‌న సినిమాల్లో కులం గురించి ధైర్యంగా చ‌ర్చించే ద‌ర్శ‌కులు త‌క్కువ‌. గ‌తంలో ఏవో కొన్ని వ‌చ్చాయి కానీ, అవి కూడా అగ్ర‌కులాలు సానుభూతితో చిన్న కులాల్ని ద‌గ్గ‌రికి తీసుకుంటున్న‌ట్టు వుండేవి త‌ప్ప ఇంకోలా కాదు. హీరో త‌క్కువ కులం వాడైతే సినిమాలోని పెద్ద మ‌నుషుల పాత్ర‌లు ఒరేయ్ అని పిలుస్తూ వుంటాయి. ఇది క‌రెక్ట్ కాదు అని చెప్పిన ద‌ర్శ‌కులు దాదాపుగా లేరు. ఎందుకంటే వాళ్లు కూడా అగ్ర‌కుల నేప‌థ్యంతో రావ‌డం వ‌ల్ల వాళ్ల‌కి క్యాస్ట్ డైన‌మిక్స్ అర్థం కాలేదు.

త‌మిళంలో పా రంజిత్‌కి కుల కోణం తెలుసు. తెలుగులో క‌రుణ‌కుమార్‌కి తెలుసు. ఆయ‌న తీసిన శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ ఇదే.

సినిమా మాస్ మీడియా కాబ‌ట్టి ఏ డైరెక్ట‌ర్‌కైనా ప‌రిధులు, ప‌రిమితులుంటాయి. అయినా క‌రుణ‌కుమార్ బ‌లంగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. సుధీర్‌కుమార్ హీరోయిజం అనే మాయలో చిక్కుకుని కొంచెం త‌డ‌బ‌డినా నిల‌దొక్కుకున్నాడు.

ఇది మామూలు ప్రేమ క‌థే. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. వేరే కులం కావ‌డం వ‌ల్ల అమ్మాయి తండ్రికి ఇష్టం వుండ‌దు. మ‌ధ్య‌లో ఒక విల‌న్‌. హీరో మీద అన్యాయంగా కేసు , జైలు వాళ్ల‌ని విడ‌దీయ‌డం. అఖ‌రున షాకింగ్ ట్విస్ట్‌.

కులంలో వున్న విచిత్రం ఏమంటే న‌గ‌రాల్లో మ‌న‌ల్ని ఎవ‌రూ కులం అడ‌గ‌రు. కానీ ఎలాగో మ‌న‌మెవ‌రో తెలిసిపోతుంది. పెద్ద చ‌దువులు నేర్పే యూనివ‌ర్సిటీల్లో అన్నీ కులం ఆధారంగానే న‌డుస్తాయి. హాస్ట‌ల్ రూముల్లో కూడా ఆయా కుల‌పోళ్లే వుంటారు. రాజ‌కీయాల్లో కులం ఆధారంగా టికెట్లు ఇస్తారు. ఏ కులం వారికి టికెట్ ఇస్తే గెలుస్తారో లెక్క‌లేస్తారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే రాజ‌కీయ రంగ‌మే కులం ఆధారంగా న‌డుస్తున్న‌ప్పుడు అన్నీ కూడా దాని నీడ‌లోనే వుంటాయి.

ఆశ్చ‌ర్యం ఏమంటే సోడా సెంట‌ర్ పెట్టుకున్న న‌రేష్ లాంటి సామాన్యుడు కూడా కులం విష‌యంలో అంత ప‌ట్టుద‌ల‌గా వుండ‌డం. క్లైమాక్స్‌లో ఆయ‌నే కీల‌కం. అయితే ముగింపు అంద‌రికీ న‌చ్చుతుందా లేదా అంటే అది వేరే విష‌యం. ఇలాంటి వాళ్లు ఇంకా వున్నారా అంటే వున్నారు, కనిపిస్తూనే వున్నారు. లేరా అంటే లేరు. సొసైటీ చాలా మారింది. సినిమాలో హీరోయిన్ అడిగిన‌ట్టు జ‌న‌రేష‌న్ మారింది మీరు కూడా మారండి అంటుంది. 1960-70 మ‌ధ్య‌న పుట్టిన వాళ్లు ఇప్పుడు త‌ల్లిదండ్రులు. పిల్ల‌ల అభిప్రాయాల్ని అర్థం చేసుకుంటున్నారు. కులాంతర పెళ్లిళ్ల‌కి అభ్యంత‌రం చెప్పే వాళ్ల సంఖ్య త‌గ్గింది. మొద‌ట్లో కోప‌తాపాలున్నా క‌లిసిపోతున్నారు. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఈ మార్పుని ఆమోదించారు. అయితే ప‌ల్లెలు కూడా కాలాన్ని బ‌ట్టి మారుతున్నాయా అంటే అనుమాన‌మే.

ఈ క‌థ ప‌ల్లెటూర్లో జ‌రుగుతుంది. కులం సంగ‌తి నేరుగా ప్ర‌స్తావించ‌క‌పోయినా మేము కేసు పెడితే నీకు బెయిల్ కూడా రాద‌ని హీరో తండ్రి అన‌డంతో మ‌న‌కి ఎవ‌రేమిటో తెలుస్తుంది. హీరో తండ్రిని అంద‌రి ముందు అవ‌మానిస్తే హీరో ఒక‌ర్ని పొడుస్తాడు. కుట్ర‌తో హీరోని హ‌త్య కేసులో ఇరికిస్తారు. బెయిల్ మీద వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది సినిమా.

చాలా సీన్స్‌లో సుధీర్ బాబు ది బెస్ట్ అనిపిస్తాడు. తండ్రిని అవ‌మానించార‌ని తెలిసిన‌ప్పుడు, క్లైమాక్స్‌లో న‌రేష్‌తో మాట్లాడిన‌ప్పుడు ఎమోష‌న్స్ పీక్ లెవ‌ల్‌లో వుంటాయి. ఆనంది స‌హ‌జ న‌టి. విల‌న్ అతి చేయ‌కుండా ఒరిజ‌న‌ల్‌గా వున్నాడు. రెండు పాట‌లు బాగున్నాయి. సైర‌త్, ఉప్పెన గుర్తుకొచ్చినా అమలాపురం నేటివిటీ , యాస ఆక‌ట్టుకుంటాయి. లాయ‌ర్ పాత్ర‌లో ర‌చ‌యిత అరిపిరాల స‌త్య‌ప్ర‌సాద్ క‌నిపిస్తాడు. క‌త్తి మ‌హేశ్ గెస్ట్ రోల్‌లో క‌నిపిస్తారు. బ‌తికి వుంటే బాగుండ‌నిపించింది.

అన్నిటికంటే ముఖ్యంగా స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు , ఇంద్ర ద‌శ‌ల్ని దాటుకుని తెలుగు సినిమా కొత్త అడుగులు వేస్తోంది.

శ్రీ‌దేవి సోడా సినిమాలో గ్యాస్‌ త‌గ్గింద‌ని స‌మీక్ష‌లొచ్చాయి. త‌గ్గింది గ్యాస్‌ కాదు, గాఢ‌త‌. పొడ‌వు వెడ‌ల్పు చూసుకున్న క‌రుణ‌కుమార్ డెప్త్ స‌రిగా చూసుకోలేదు. జైల్లో ఫైట్‌, హైద‌రాబాద్ పారిపోయి పెళ్లిలో పాట పాడ‌డం ఇవ‌న్నీ అతికించిన‌ట్టున్నాయి. సో నెరేష‌న్ వ‌ల్ల కూడా అక్క‌డ‌క్క‌డ బ‌రువుగా అనిపిస్తుంది. అవి ప‌క్క‌న పెడితే ఇది మంచి సినిమా, చూడ‌త‌గిన సినిమా.

Also Read: అత్తారింటికి ..క్లైమాక్స్ తాగుబోతు రమేష్ చేసుంటే ….?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి