iDreamPost

పదేళ్ల క్రితం నాటి సినిమా ఇప్పుడు రీమేక్ అవసరమా!

పదేళ్ల క్రితం నాటి సినిమా ఇప్పుడు రీమేక్ అవసరమా!

ఒకప్పుడంటే ఇతర భాషల చిత్రాలు అందుబాటులో ఉండేవి కావు. దాంతో ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ అవ్వడం ఎక్కువగా జరుగుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా ప్రపంచ సినిమా అర చేతిలోకి వచ్చేసింది. ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు ముందే చూసేస్తున్నారు. దాంతో రీమేక్ లు చూడటానికి అంతగా ఆసక్తిగా చూపించట్లేదు. అయినప్పటికీ కొందరు మేకర్స్ మాత్రం రీమేక్ లను వదట్లేదు. తాజాగా హీరో సుధీర్ బాబు అయితే ఏకంగా పదేళ్ల క్రితం నాటి సినిమా రీమేక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైంది. మేకర్స్ ప్రకటించలేదు కానీ ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది మలయాళ ఫిల్మ్ ముంబై పోలీస్ కి రీమేక్ అనే కామెంట్స్ వినిపించాయి. సినిమా చూశాక రీమేక్ అని పూర్తి క్లారిటీ వచ్చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ముంబై పోలీస్ 2013లో విడుదలై ఘన విజయం సాధించింది. అసలు ఆ సమయంలో ఇది చాలా పెద్ద ప్రయోగం అని చెప్పొచ్చు. కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఊహకందని విధంగా ఉంటుంది. అప్పట్లో వచ్చిన ఈ విభిన్న చిత్రాన్ని పదేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడమే విచిత్రంగా ఉంది.

ప్రమోషన్స్ సమయంలో హంట్ టీమ్ అసలు ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పటిదాకా తెలుగులో రాలేదంటే.. ఇప్పటికే వేరే భాషలో వచ్చిన చిత్రాన్ని రీమేక్ చేయడం కాదు. మన సినిమాని ఇతర భాషల వాళ్ళు రీమేక్ చేయాలి అనిపించే అంత కొత్త కాన్సెప్ట్ తో రావాలి. కొందరు తెలుగు యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా పయనిస్తున్నారు కూడా. కానీ వీళ్ళు మాత్రం పదేళ్లు వెనక్కి పయనించారు. నిజానికి సుధీర్ బాబు మంచి నటుడు, సినిమాల ఎంపిక కూడా బాగుంటుంది. మూస ధోరణిలో పోకుండా విభిన్న కథలను ఎంచుకుంటాడు. అలాంటి సుధీర్ పదేళ్ల క్రితం నాటి సినిమాని రీమేక్ చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా సినిమాని ఈ పదేళ్లలో వచ్చిన మార్పులకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా చేయడంలో ఫెయిల్ అయ్యారు. కేవలం క్లైమాక్స్, సుధీర్ బాబు యాక్షన్ కోసం ఈ సినిమా తీసినట్లుగా ఉంది. అందుకే క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా తేలిపోయినట్టుగా ఉంది.

అయినా వాళ్ళు పదేళ్ల క్రితమే ఆ స్థాయిలో ఆలోచించి సినిమా తీస్తే.. ఇప్పుడు మనం ఇంకెంత కొత్తగా ఆలోచించి విభిన్న సినిమా తీయాలి అనుకోవాలి గానీ.. అప్పటి సినిమాలను రీమేక్ చేసుకుంటూ ఉంటే ప్రేక్షకులకు మాత్రం చూడాలనే ఆసక్తి ఎలా ఉంటుంది?. సినిమా తీసేముందు మేకర్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి