iDreamPost

మరో సారి సత్తా చూపుతున్న సోషల్‌ మీడియా

మరో సారి సత్తా చూపుతున్న సోషల్‌ మీడియా

సోషల్‌ మీడియా.. సంప్రదాయ మీడియాకు భిన్నమైన వైఖరితో ప్రతి అంశాన్ని క్షణాల వ్యవధిలోనే లక్షలాది మందికి చేరవేస్తున్న సాధనం. వ్యతిరేకంగా వచ్చే ఆరోపణల విషయం పక్కన పెడితే. చీకట్లో ఉండిపోవాల్సిన అనేకానేక గొంతులకు ఇప్పుడు ఈ సరికొత్త మీడియా సాధనం వేదికగా నిలుస్తోంది. అనేక సమస్యలను ఈ మీడియం ద్వారా వెలుగులోకి రావడంతో పాటు, అనేక సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తోందనే చెప్పాలి. ఎక్కడైనా చిన్నారులు తప్పిపోయిన వారిని వారి కుటుంబీకులకు చేర్చడం దగ్గర్నుంచి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటం వరకు సోషల్‌ మీడియా ద్వారా ప్రజల ముందుకొస్తోంది.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంల ద్వారా తమ ఉద్దేశాన్ని రైతులు ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. కిసాన్‌ సంయుక్త్‌ మోర్చా నిర్వహణలో నిర్వహిస్తున్న ఈ సోషల్‌ మీడియా వింగ్‌ ద్వారా ఒక్క ఫేస్బుక్‌ ద్వారా నడుస్తున్న పేజ్‌లో రైతు ఉద్యమం 94 లక్షల మందికి చేరిందంటే ఎంత వేగంగా ప్రజలకు చేరుతుందో అర్ధం చేసుకోవచ్చు. దీని ద్వారానే లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా నడుస్తుండడంతో అక్కడెక్కడలో ఢిల్లీ శివార్లలో నడుస్తున్న రైతు పోరాటం దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోని వారు కూడా వీక్షించగలుగుతున్నారు. ఇందు కోసం దాదాపు అరవై మందికిపైగా ఐటీ వాలంటీర్లు కృషి చేస్తున్నారట.

ఇక్కడ పోరాటం, దాని ప్రయోజనాలు, ఎవరికి మద్దతు అన్నదాన్ని పక్కన పెడితే తమ గోంతును అత్యంతగా వేగంగా ప్రజల ముందుకు తీసుకు రాగలగడంలో సోషల్‌ మీడియా ప్రధానంగా నిలిచిందనడానికి ఇదే నిదర్శనంగా ఇప్పుడు మరో సారి చెబుతున్నారు. దేశంలో 70శాతం మందికి పైగా ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయరంగం, అందులో కీలకమైన రైతాంగం సమస్య కావడంతో మన దేశంతో పాటు, ఇతర దేశస్తులు కూడా ఈ పోరాటం వైపు. ఉత్కంఠతతోనే చూస్తున్నారు.

పోరాటం ఏదైనా అధికారంలో ఉన్న వాళ్ళకు కాస్తంత ఇబ్బందిపెట్టేదే అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ రైతు ఉద్యమం పట్ల భిన్నవైఖరితోనే ఉందని చెప్పాలి. రోజుల తరబడి చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ఈ పోరాటాన్ని నడుపుతున్నారు. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య అనేక దఫాలుగా నడిచిన చర్చలు కూడా సఫలం కాలేదు. దీంతో ప్రభుత్వం వైపునుంచి వచ్చే ప్రతి కామెంటూ రైతుల్లో పట్టుదలను పెంచుతోందనే చెప్పాలి. అదే సమయంలో తమ పోరాట లక్ష్యాన్ని గురించి అపోహలు, అబద్దాలు ప్రచారం కాకుండా రైతు ఉద్యమ నేతలు సోషల్‌ మీడియా వేదికగా తగిన ఏర్పాట్లు చేసుకోవడం చూస్తుంటే వ్యవహారం పకడ్భంధీగానే నడుస్తున్నట్లుగా భావిస్తున్నారు.

ఏది ఏమైనా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా రైతుల పోరాటాన్ని గురించి ప్రజల ముందుకు చేరిపోతోంది. అదే సమయంలో అందరికి ఆమోద యోగ్యమైన పరిష్కారం లభించాలని అదే సోషల్‌ మీడియా వేదికగా పలువురు ఆకాంక్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి