iDreamPost

అడిగారో..? లేదో..? భద్రత ఇచ్చారు..!

అడిగారో..? లేదో..? భద్రత ఇచ్చారు..!

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయం నడవగా.. తాజాగా లేఖ చుట్టూ రాజకీయం నడుస్తోంది. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి రాశాడని చెబుతున్న లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఆయన స్పందించకపోవడంతో రాజకీయ దుమారం రేగుతోంది.

ఆ లేఖ రమేష్‌కుమార్‌ రాశారో.. లేదో..గానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన కార్యాలయానికి సీఆర్‌ఫీఎష్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న పోలీసులతోపాటు వీరు అదనంగా భద్రతనిస్తారు. గన్నవరంలోని 39వ బెటాలియన్‌కు చెందిన ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కానిస్టేబుల్‌తోపాటు 8 మంది కానిస్టేబుళ్లు ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి 24 గంటల పాటు భద్రతగా ఉంటారు.

కాగా. లేఖ విషయం తేల్చాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిన్న గురువారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయగా, రాష్ట్రంలో కరోనా కమ్ముకొస్తుంటే లేఖ ఎవరు రాశారన్న రాజకీయం అవసరమా..? అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్‌ నరశింహారావు ఆ లేఖపై రమేష్‌కుమార్‌ ఇప్పటి వరకూ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సందట్లో సడేమియాలాగా ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థలను మళ్లీ మొదటి నుంచి జరిపించాలని గవర్నర్‌ను కలిశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి