iDreamPost

మెల మెల్లగా.. వృథా కాకుండా..

మెల మెల్లగా.. వృథా కాకుండా..

కరోనా వైరస్‌ బారిన పడిన ప్రజలను కాపాడడంలోనూ, వారికి వైద్య పరంగా అండగా ఉండడంలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కరోనా బారిన పడిన వివిధ రంగాలను అదే స్థాయిలో ఆదుకుంది. ఈ క్రమంలో విద్యార్థులు కూడా కరోనా వైరస్‌ వల్ల నష్టపోకుండా చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ ప్రభావంతో కర్ణాటక, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు జీరో విద్యా సంవత్సరం ప్రకటించగా.. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పించాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన సాగించగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో పాఠాలు చెప్పేలా.. ఏపీ ప్రభుత్వం బడులను తెరిచింది.

మూడు దశల్లో పాఠశాలను తెరిచి.. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో 9, 10 తరగతి విద్యార్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కాగా.. ఈ రోజు నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతలు మొదలయ్యాయి. ఈ రోజు 6 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని ముందు నిర్ణయించినా.. కోవిడ్‌ వ్యాప్తి ప్రమాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కేవలం 8వ తరగతి వారికే పాఠశాలలు ప్రారంభించారు. మరికొద్ది రోజుల తర్వాత 6, 7 తరగతుల వారిని పాఠశాలకు పంపేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రైమరీ పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లోపు 6, 7 తరగతుల వారికి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

చలి తీవ్రత కారణంగా నిన్నటి వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పాఠశాలలు.. ఈ రోజు నుంచి ఉదయం 9:30 గంటలకు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజు పాఠశాల నిర్వహిస్తుండగా.. తొమ్మిది, ఎనిమిది తరగతుల వారికి వారంలో రోజు మార్చి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. వారంలో మూడు రోజులు 9వ తరగతి వారికి, మరో మూడు రోజులు 8వ తరగతి వారికి పాఠశాల నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు కోవిడ్‌ బారిన పడకుండా పాఠశాలల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాతే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత.. రెండు పూటలా పాఠశాలు నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విద్యా సంవత్సరం వృథా కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి