iDreamPost

జాతీయ వాదం కాదు.. జాతీయ విధానం కావాలిప్పుడు

జాతీయ వాదం కాదు.. జాతీయ విధానం కావాలిప్పుడు

కరోనా.. ఓ ప్రపంచ మహమ్మారి. భూమిపై బతికున్న ఏ ఒక్కరూ ఇప్పటిదాకా చూడని మహా విపత్తు. 31 లక్షల మందిని బలి తీసుకున్న రాకాసి. రోజూ వేల మందిని చంపుతూనే ఉంది. ఇండియాలో అయితే.. ఎక్కడా లేనంతగా రికార్డు స్థాయిలో వైరస్ బారిన పడుతున్నారు. రోజూ 3.5 లక్షల కేసులు, రెండున్నర వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పుడున్నది నేషనల్ ఎమర్జెన్సీ లాంటిదే. కానీ పరిస్థితులు రోజురోజుకూ చేయి దాటిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉంది. ఏమీ చేయలేని స్థితిలో చేష్టలుడిగి చూస్తుండిపోతోంది. దీంతో కేంద్రం చేయాల్సిన పనిని.. సుప్రీంకోర్టు చేస్తోంది. రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతలను తీసుకుంటోంది.

మౌనంగా చూసే ప్రేక్షకులం కాదు

కరోనా వైరస్ సెకండ్ వేవ్ జాతీయ సంక్షోభమని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ పరిస్థితిని తాము మౌనంగా చూసే ప్రేక్షకులం కాదని స్పష్టం చేసింది. కరోనా మేనేజ్‌మెంట్‌ కోసం ఓ జాతీయ విధానాన్ని రూపొందించాలని కోరుతూ తాము స్వీయ విచారణ జరుపుతున్నామని చెప్పింది. కొన్ని జాతీయ సమస్యలపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంటుందని చెప్పింది. రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించవలసిన అంశాలు ఉంటాయని పేర్కొంది. సమన్వయపరిచే పాత్రను సుప్రీంకోర్టు పోషిస్తోందని తెలిపింది. భౌగోళిక పరిమితుల వల్ల ఏవైనా సమస్యలను పరిష్కరించడంలో హైకోర్టులు ఇబ్బందులను ఎదుర్కొంటే, సుప్రీంకోర్టు సహాయపడుతుందని వివరించింది.

కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ఆక్సిజన్, మందులు వంటి అత్యవసన సేవలు, సరఫరాల కోసం జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ సంక్షోభ నివార‌ణ‌లో భాగంగా ఆర్మీ వంటి కేంద్ర వ‌న‌రుల‌ను వినియోగించ‌డం, వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కేంద్రానికి సూచించింది. కేంద్రానికి, రాష్ట్రాల‌కు వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌డ‌మేంట‌ని నిల‌దీసింది. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో కేంద్రానికి పూర్తి నియంత్ర‌ణ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : యువతకు వ్యాక్సిన్ అందాలంటే మరో నెల ఆగాల్సిందే..!

సుప్రీంకోర్టు చెప్పేదాకా తెలియదా?

దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రాణవాయవు అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల మధ్య సమన్వయం చేయాల్సిన కేంద్ర సర్కారు చేతులెత్తేసింది. గందరగోళంగా చేసిన ఆక్సిజన్ కేటాయింపులతో రాష్ట్రాల మధ్య గొడవలకు కారణమైంది. ఎక్కడ ఉత్పత్తి అయితే.. అక్కడి అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేయలేదు.

మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడున్నర నెలలు అవుతున్నా.. కనీసం 10 కోట్ల మందికి కూడా రెండు డోసులు వేయలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్ చేస్తున్నామంటూ డప్పు కొట్టుకుంది.

ప్రస్తుతమున్న హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ధరల విషయంలో తయారీ సంస్థలకు అధికారం ఇవ్వడం విమర్శల పాలైంది. విపత్తు సమయంలో లాభాల గురించి తయారీ సంస్థలు మాట్లాడుతున్నా.. కేంద్రం ఏం చేయలేకపోతోంది. కేంద్రానికి, రాష్ట్రాల‌కు వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌డ‌మేంట‌ని సుప్రీంకోర్టు అడిగితే నీళ్లు నములుతోంది. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో కేంద్రానికి పూర్తి నియంత్ర‌ణ ఉండాల‌ని సుప్రీంకోర్టు చెప్పేదాకా కేంద్రానికి తెలియకపోవడం దురదృష్టకరం. వాటర్ బాటిల్ ధరలకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పిన సంస్థలు.. భారీగా రేట్లు నిర్ణయించినా స్పందన కరువు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో.. ధరలు తగ్గించాలంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థలను కేంద్రం కోరింది. ఆదేశాలివ్వాల్సింది పోయి.. రిక్వెస్ట్ చేయడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.

Also Read : పంపిణీ సరే… టీకాలు ఏవీ మోడీజీ..?

జాతీయ విధానం ఏదీ?

జాతీయ వాదం పేరుతో రాజకీయాలు చేస్తుంది బీజేపీ. కానీ విపత్తు వేళ జాతీయ విధానం రూపకల్పన చేయడం మాత్రం తెలియదు. వ్యాక్సినేషన్, కరోనా కట్టడి, ఆక్సిజన్ సరఫరా, రాష్ట్రాల మధ్య సమన్వయం.. ఇలా అన్నింటిలోనూ ఫెయిల్ అయింది. ఆక్సిజన్ కోసం రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి.. వ్యాక్సిన్ డోసులు అందక వ్యాక్సినేషన్ సరిగ్గా సాగడం లేదు.. రెమ్ డెసివిర్ మందులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి.. కానీ వీటిని అడ్డుకునే చర్యలు శూన్యం.

రెండు నెలల కిందటి వరకు.. వ్యాక్సిన్ డోసులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన భారత దేశం.. ఇప్పుడు టీకాల కొరతతో అల్లాడిపోవడానికి కారణం ఎవరు? ఏడాది కిందట హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను విదేశాలకు సాయంగా పంపిన భారత దేశానికి.. ఇప్పుడు రెమ్ డెసివిర్ మందుల కొరత రావడానికి కారణం ఎవరు? ప్రపంచానికి సాయం చేశామని గొప్పలు చెప్పుకునే మనం.. ఇప్పుడు ప్రపంచదేశాల సాయం కోసం ఎదురుచూసే పరిస్థితికి కారణం ఎవరు?

ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు.. సమస్యను పరిష్కరించే విధానం కావాలి. మాటలు కాదు.. చేతలు కావాలి. జాతీయ వాదం కాదు.. జాతీయ ప్రణాళిక కావాలని కోరుతోంది దేశం.

Also Read : కోలుకుంటున్న వారే ఎక్కువ.. కలవరం అవసరం లేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి