iDreamPost

వారికి SBI శుభవార్త.. 12 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు

  • Published Aug 21, 2023 | 12:40 PMUpdated Aug 21, 2023 | 12:40 PM
  • Published Aug 21, 2023 | 12:40 PMUpdated Aug 21, 2023 | 12:40 PM
వారికి SBI శుభవార్త.. 12 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐలో లోన్‌ తీసుకున్న కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐలో లోన్లు తీసుకున్న వారిలో చాలా మందికి ఇది భారీ ఊరట కలిగించే ప్రకటన అని చెప్పవచ్చు. ఇంతకు ఏంటా శుభవార్త అంటే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా లోన్ మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఎస్‌బీఐ మారటోరియం వర్తించే వారు.. ఏకంగా ఏడాది పాటు అనగా 12 నెలలు ఈఎంఐ కట్టే అవసరం లేదు. మరి ఈ బంపరాఫర్‌ ఎవరికి వర్తిస్తుందంటే..

అల్లర్లు, హింసకాండతో రగిలిపోతున్న మణిపూర్ వాసులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. తాజాగా తాను ప్రకటించిన లోన్‌ మారటోరియం కేవలం మణిపూర్‌ వాసులకే వర్తిస్తుంది అని ఎస్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ఏదో ఒక చోట అల్లర్లు చెలరేగుతూ.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అసలు ప్రజలు బయటకు వచ్చేందుకే వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఎస్‌బీఐ తన రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో మారటోరియం కూడా ఉంది.

మణిపూర్ వ్యాప్తంగా ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న వారు వచ్చే 12 నెలల వరకు ఈ లోన్ ఈఎంఐ మారటోరియం పొందొచ్చు. అంటే ఏడాది పాటు ఈఎంఐలు కట్టక్కర్లేదు అన్నమాట. ఈఎంఐ మొత్తం, వడ్డీ చెల్లింపు, ఇతర ఇన్‌స్టాల్‌మెంట్లపై ఈ ప్రయోజనం పొందవచ్చు అని ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే 2023, మే 3 నాటికి ఎవరి అకౌంట్ మొండి బకాయిగా మారలేదో అలాంటి వారికి మాత్రమే.. ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఈ మేరకు ఎస్‌బీఐ మణిపూర్ రీజనల్ ఆఫీస్ సర్క్యూలర్ జారీ చేసింది. ఈ రిలీఫ్ ప్యాకేజ్ పొందాలని భావించే వారు తమ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. ‘‘అల్లర్లు, హింసకాండ వల్ల ప్రభావితమైన మణిపూర్‌లోని రుణ గ్రహీతల కోసం ఎస్‌బీఐ ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ స్వాగతించే చర్య. ఈఎంఐలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం వారికి చాలా అవసరం. సాధారణ జీవితం, ఫైనాన్షియల్‌గా వారి ఆర్థిక నిర్వహణలో ఇది ఎంతో సహాయపడుతుంది’’ అని ఓ అధికారి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి