iDreamPost

టీ.కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా నాగార్జున సాగర్‌

టీ.కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా నాగార్జున సాగర్‌

మరో ఉప ఎన్నిక రాజకీయాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ సహా.. కాంగ్రెస్‌ కూడా ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకే పీసీసీ చీఫ్‌ నియామకంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డికి స్థానికంగా ఉన్న పేరు, బలంతో ఆ స్థానంలో గెలుపొందాలని భావిస్తోంది.

మిగతా పార్టీల సంగతి ఎలాగున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి నాగార్జునసాగర్‌లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు పరాజయమే మిగులుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో అయితే డిపాజిట్‌ కూడా దక్కలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చాలా డివిజన్లలో అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌పైనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. పీసీసీ ఎంపిక ప్రభావం ఆ ఎన్నికపై పడుతుందనే ఉద్దేశంతోనే సీనియర్లు అందరూ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ప్రకటించొద్దవద్దని ఏఐసీసీ వర్గాలను కోరుతున్నారు. ప్రస్తుతం పార్టీ పరంగా ప్రతీ అంశాన్ని నాగార్జునసాగర్‌తో ముడిపెట్టుకుని టీపీసీసీ బేరీజు వేసుకుంటోంది.

7 వేల ఓట్ల తేడాతో జానా ఓటమి…

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య, కాంగ్రెస్‌ నుంచి జానా రెడ్డి నిలబడ్డారు. ఆ ఇద్దరి మధ్యే హోరాహోరీ పోరు కొనసాగింది. నోములకు 83,655 ఓట్లు పోలవ్వగా.. జానారెడ్డికి 75,884 ఓట్లు పోలయ్యాయి. కేవలం 4 శాతం (7, 771) ఓట్ల తేడాతో జానారెడ్డి ఓడిపోయారు.

ఈసారి ఎన్నికల్లో కూడా జానారెడ్డి లేదా.. ఆయన కుమారుడిని ఇక్కడి రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ఠ కాస్త అయినా పెరగాలంటే నాగార్జునసాగర్‌లో గెలుపు చాలా అవసరం. అందుకే ఇప్పటికే నుంచే జానారెడ్డి స్థానికంగా రాజకీయాలు, ప్రచారాలు ప్రారంభించారు.

బుధవారం టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఎలాగైనా అక్కడ గెలుపుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగేవరకూ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేయవద్దని అధిష్ఠానాన్ని కోరారు. ఉప ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్‌ ఎంపికపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సహా కొంత మంది పెద్దలతో ఫోన్‌ ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. మరి ఇంతలా కోరుకుంటున్న జానా ఆశ నెరవేరుతుందా..? లేదా చూడాలి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి