iDreamPost

పీసీసీ చీఫ్ విషయంలో సీనియర్ల పంతం నెగ్గిందా..?

పీసీసీ చీఫ్ విషయంలో సీనియర్ల పంతం నెగ్గిందా..?

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో సస్పెన్స్ కి తెరపడినట్లు తెలుస్తోంది. పీసీసీ పగ్గాలను జీవన్ రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడ్డప్పటికీ చివరి వరకూ రేవంత్ రెడ్డి, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు గట్టిగా వినిపించాయి. కాగా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లులు తెలుస్తోంది. ఇవ్వాలో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పీసీసీ చీఫ్ పదవితో పాటు మరో నాలుగైదు కమిటీలను కూడా ఏఐసీసీ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ, స్ట్రాటజీ కమిటీ, మ్యానిఫెస్టో కమిటీల భాద్యులను కూడా అధిష్టానం ప్రకటించనుందట.

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో పీసీసీ పదవి కోసం ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. దీంతో అధిష్టానం తెలంగాణ నేతల అభిప్రాయాలు సేకరించింది. పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్ సీనియర్లతో వేరు వేరుగా సమావేశమై పీసీసీ పదవి గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన పలువురి పేర్లు ప్రస్తవనకు వచ్చాయి. కాగా… మొదటి నుంచీ రేవంత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ వచ్చింది.

నిస్తేజంలో కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ అవసరమని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాగా… రేవంత్ కి పార్టీ పగ్గాలు అప్పగించడం పట్ల సీనియర్ నేతలు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో రేవంత్ తో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా అధిష్టానం పరిశీలినలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ అందుకుంది. కాగా… అనూహ్యంగా అధిష్టానం జీవన్ రెడ్డి వైపు మొగ్గుచూపింది.

జీవన్ రెడ్డి సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 80ల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ మినిస్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1989 నుంచి వరుసగా నాలుగు దఫాలు జగిత్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోనూ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా జీవన్ రెడ్డికి పేరుంది. 2006, 2008లో కరీంనగర్ లోక్ సభకు కేసీఆర్ పై పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓటమిని చవిచూశారు.

సీనియర్ నేతగా జీవన్ రెడ్డికి పార్టీలో అందరితోనూ సత్సంబంధాలున్నాయి. దీంతో జీవన్ రెడ్డి పార్టీని సమసర్థవంతంగా నడిపించగలడనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ పగ్గాలు జీవన్ రెడ్డికి అప్పగించి మిగతా ఆశావహులను సైతం సంతృప్తిపరిచే దిశలో అధిష్టానం అడుగులు వేస్తోందట. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాస్కీ, శ్రీధర్ బాబు తదితరులు వేరు బాధ్యతలు అప్పిగించనుందని తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనకు పీసీసీ పదవి కంటే ప్రచార కమిటీ బాధ్యతలపై ఆసక్తి ఉందని ప్రకటించడం గమనార్హం. కాగా… పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో జరుగుతున్నదంతా ఊహాగానాలే అని జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. కానీ… అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానన్నారు.

ఏది ఏమైనా అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ కి పీపీసీ భాద్యతలు అప్పగించాలనుకున్నప్పటికీ సీనియర్ల వ్యతిరేకత కారణంగా జీవన్ రెడ్డి వైపు మళ్లినట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి వాళ్లు మొదటి నుంచీ రేవంత్ కి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తాజా నిర్ణయంతో సీనియర్ల పంతం నెగ్గినట్లయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి