iDreamPost

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో జనసేన

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో జనసేన

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడినుంచి ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయనుంది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..?

రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. జనసేన పార్టీ పట్ల తెలంగాణ బీజేపీ నేతలు చులకన భావంతో మాట్లాడారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవికి మద్దతు పలికారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బిజెపి జనసేన మైత్రి ఉండదని అందరూ భావించారు. కానీ ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు కలగజేసుకుని పవన్ కు నచ్చ చెప్పారు. తిరుపతిలో జనసేన బిజెపి మైత్రి కొనసాగుతుందని సోము వీర్రాజు ప్రకటించారు. కానీ ఇది జరిగి ఒక రోజు గడిచింది లేదో పవన్ కళ్యాణ్ అనూహ్య రీతిలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో జనసేన పోటీ చేస్తుందని సంకేతాలు ఇచ్చారు. అది కూడా బిజెపితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని సంకేతాలు వెలువరించారు.

సామాజిక వర్గాలకు ఆకట్టుకునేలా పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్ష సాధన కోసమే జనసేన పోరాటం నినాదంతో జనసేన పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అభిమానులను క్యాడర్ మార్చుకోవడమే లక్ష్యంగా తెలుస్తోంది.

తెలంగాణ నుంచి ఉద్యమం ప్రారంభం అవుతోందని జనసేన తెలిపింది. దీనికి అనుగుణంగా ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపనుంది. సాగర్ ఉప ఎన్నిక కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గ కమిటీలు వేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోమని.. కానీ బరిలోకి దిగుతామని జనసేన ఇండికేషన్ ఇచ్చింది. అయితే అభ్యర్థి ఎవరు అనేదానిపై ఇంకా ఎంపిక జరుగుతుంది.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల జనసేన పోటీ చేయలేదు. అయితే తర్వాత మాత్రం పోటీ చేస్తామని తెలిపింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. ఆయాచోట్ల కమిటీలు వేస్తూ.. క్యాడర్ బలోపేతం చేయడంపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి బరిలోకి దిగుతారని వెల్లడించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చనిపోవడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి