iDreamPost

సంక్రాంతికి రావడానికి ‘ఆర్ఆర్ఆర్’ విశ్వప్రయత్నాలు.. అసలు సంగతి ఇదా?

సంక్రాంతికి రావడానికి ‘ఆర్ఆర్ఆర్’ విశ్వప్రయత్నాలు.. అసలు సంగతి ఇదా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలుగు సినీ నిర్మాతలకు టికెట్ల విషయంలో అభయం లభించడంతో పెద్ద సినిమాలన్నీ విడుదలకు క్యూ కట్టాయి. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయాలని సిద్ధంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యామ్, మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ అలాగే వరుణ్ తేజ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కావాల్సిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదల కావాలి. కరోనా మహమ్మారి ఎంటర్ కావడంతో ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.

అయితే షూటింగ్ లేట్ అవ్వడం కరోనా మహమ్మారి రెండో దశ కూడా విరుచుకు పడిన నేపథ్యంలో సినిమాని అనుకున్న తారీకున తీసుకురాలేక పోతున్నామని మరోసారి ప్రకటించారు. అయితే విడుదల ఎప్పుడు కానున్నది అనే విషయం మీద మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మేకర్స్ సంక్రాంతికి విడుదల కాబోతున్న మిగతా సినిమాల దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట. తాము సంక్రాంతి కి వస్తున్నాము కాబట్టి మీరు వీలైతే వెనక్కి వెళ్ళే యోచన చేయమని కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కూడా చాలా ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలో తాము మాత్రం తమ సినిమాని వెనక్కి జరిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా వెనక్కి జరుపుకోవడానికి కాస్త సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కానీ దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ సంక్రాంతికే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తాము రిలీజ్ చేస్తే కచ్చితంగా లాభాల బాట పడతామని భావించిన డిస్ట్రిబ్యూటర్లు కొంత మంది ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నిర్మాతకు అడ్వాన్స్ ఇచ్చారట. అక్టోబర్ నెలలో విడుదల అవుతుందని భావించి ఎప్పుడో ఈ అడ్వాన్సులు ఇచ్చినా ఇప్పుడు సినిమా వచ్చే జనవరికి కూడా విడుదల అవుతుందో లేదో తెలియని పరిస్థితి. అసలే కరోనా కారణంగా పూర్తిగా మార్కెట్ డల్ గా ఉంది. ఇలాంటి సమయంలో సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో వాళ్లకు అడ్వాన్సు ఇచ్చుకోవడానికి కూడా తమ దగ్గర డబ్బు లేదని సినిమాని రిలీజ్ చేస్తే సంక్రాంతికి రిలీజ్ చేయాలని లేదా తమ అడ్వాన్స్ లు వెనక్కి ఇస్తే తాము ఆ అడ్వాన్స్ డబ్బుతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు కొనుక్కుంటాము అని తేల్చి చెప్పారట. అయితే అడ్వాన్సులు తిరిగిచ్చేయడం అంటే సాధారణంగా జరిగే వ్యవహారం కాదు కాబట్టి సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారట ఆర్ఆర్ఆర్ దర్శకనిర్మాతలు.. మరి చూడాలి ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ కూడా వస్తుందో లేక ఆలస్యం అవుతుందో అనేది.

Also Read : పాన్ ఇండియా సినిమాకు ఎన్ని చిక్కులో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి