iDreamPost

బయటపడిన నిమ్మగడ్డ బండారం, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్..

బయటపడిన నిమ్మగడ్డ బండారం, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్..

సహజంగా రాజకీయ నేతల మాటలకు,ఆ చరణకు పొంతన ఉండదన్నది జగమెరిగిన సత్యం. కానీ అధికారిగా వ్యవహరించాల్సిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడ అదే పంథాలో సాగుతున్నారు. బహుశా ఆయన చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారనే ఆరోపణలుండడం వల్ల, బాబుని అనుసరిస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పార్క్ హయత్ హోటల్ లో రహస్యంగా బీజేపీ నేతలతో భేటీ అయిన ఆయన అదే నేతల మాదిరిగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏపీలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి అయినప్పటికీ బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తనకు రాజ్యాంగ హోదాకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటీషన్లు వేశారు. గవర్నర్ కి ఫిర్యాదులు చేశారు. అదే సమయంలో తాను వ్యవహరించాల్సిన తీరుకి భిన్నంగా ఆయన ధోరణి ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ నివేదిక ఆధారంగా లభించిన సమాచారం ప్రకారం ఆయన నెలకు రూ. 3.2లక్షల చొప్పున వేతనంగా తీసుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయన తీరు సరిగ్గా చంద్రబాబుని తలపిస్తుండడం విశేషం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు కూడా తన కుటుంబం కోసం హయత్ హోటల్ లో సూట్ రూమ్ పేరుతో భారీ మొత్తం చెల్లించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు నిమ్మగడ్డ కూడా హైదరాబాద్ లో సొంత ఇంట్లో నివాసం ఉంటూ అద్దె పేరుతో ఏపీ ఖజానా నుంచి భారీగా లబ్ది పొందుతుండడం ఏ విధంగా సమంజమని నిలదీస్తున్న వారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఆయన ఏపీలో నివాసం ఉండాలి. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్ట్ న్యాయమూర్తులు సహా అధికారులంతా ఆ పద్ధతి అవలంభిస్తున్నారు. కానీ ఆయనొక్కరే అందుకు మినహాయింపు అన్నట్టుగా హైదరాబాద్ లో నివాసం ఉండడం , దానికి ఏపీ ఖజానా నుంచి అద్దె తీసుకోవడం అందరినీ విస్మయపరుస్తోంది. రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వహిస్తున్నానని చెబుతున్న నిమ్మగడ్డ మరి తన కార్యాలయం విజయవాడలో ఉంటే హైదరాబాద్ ని వీడి ఎందుకు రావడం లేదనే ప్రశ్నలు పలువురు వేస్తున్నారు.

హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నిమ్మగడ్డ, ఏపీలో ఇంటి అద్దె తీసుకుంటున్న వైనంపై విచారణ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరుతున్నారు. దాంతో ఇప్పుడీ ఉదంతం విశేషంగా మారింది. రాజకీయంగా దుమారం రేపుతోంది. నిమ్మగడ్డ అసలు గుట్టు మరోసారి రట్టయినట్టు కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి