iDreamPost

పేదలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. వారి కోసం ఆహా క్యాంటీన్‌లు!

  • Published Jul 20, 2023 | 9:15 AMUpdated Jul 20, 2023 | 9:15 AM
  • Published Jul 20, 2023 | 9:15 AMUpdated Jul 20, 2023 | 9:15 AM
పేదలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. వారి కోసం ఆహా క్యాంటీన్‌లు!

రాష్ట్రంలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం ఎన్నో నగదు బదిలీ పథకాలను.. అలానే పేదలకు కూడా ఉచితంగా నాణ్యమైన, విద్య, వైద్యం అందించడం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. తల్లి కడుపులో ఉన్న చిన్నారి మొదలు.. కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధుల వరకు.. ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో తాజాగా జగన్‌ సర్కార్‌ పేద ప్రజల కోసం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. దీనిలో భాగంగా.. వారికి తక్కువ ఖర్చులోనే నాణ్యమైన ఆహారం అందించేందుకు గాను సరికొత్త ఆలోచన చేసింది. ఆ వివరాలు..

పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించడం కోసం ఏపీ సర్కార్‌ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం కొత్త క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల అధ్వర్యంలో ప్రభుత్వం ఈ క్యాంటీన్‌లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం తీసుకురాబోయే ఈ క్యాంటీన్‌ల పేరు ఆహా క్యాంటీన్‌. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలు ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్‌లు నడుస్తాయి. వీటి నిర్వహణ అంశాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చూడనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో 140 ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యంగా ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం రూ.13వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. క్యాంటీన్ నిర్వహించే గ్రూపులు నెలకు రూ.500 చొప్పున మహిళా సమాఖ్య సొసైటీలో జమ చేయాల్సి ఉంటుంది. ఆహా క్యాంటీన్లలో అందించే వటంకాలను ఇంటివద్దే సిద్ధం చేస్తారు. వాటిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కియోస్క్‌ల వద్ద విక్రయిస్తారు. క్యాంటీన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో డిమాండ్‌, రద్దీని బట్టి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను అందిస్తారు.

ఇక ఈ క్యాంటీన్లలో ప్లేటు భోజనం గరిష్టంగా రూ.40కి విక్రయిస్తారు. అల్పాహారం ధర చాలా తక్కువగా ఉండనుంది.తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడం ఈ క్యాంటీన్‌ల ప్రధాన ఉద్దేశం. ఇక తొలి రోజు ప్రభుత్వాస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్‌లో అమ్మకాలు బాగా జరిగాయని.. ఒక్క రోజు 3 వేల రూపాయల వరకు విక్రయాలు సాగినట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి