iDreamPost

ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ.. కోవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు ఊరట

ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ..  కోవిడ్,  బ్లాక్ ఫంగస్ రోగులకు ఊరట

ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా కోవిడ్ ఇంకా అదుపులోకి రావడం లేదు. ముమ్మరమైన వైద్య సేవలు, ముందు జాగ్రత్త చర్యల కారణంగా పాజిటివ్ కేసుల వృద్ధి ఆగినా.. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రతి రోజు 20వేల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల బ్లాక్ ఫంగస్ బెంగ కూడా పెరుగుతోంది. వీటి బారిన పడుతున్న వేలమంది ప్రజల్లో సామాన్యులు అధికంగా ఉంటున్నారు. వేలు, లక్షలు పెట్టి ట్రీట్మెంట్ తీసుకునే స్థోమత లేని పేద రోగులను ఈ కష్టకాలంలో ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంటోంది. లక్షల మంది సామాన్య రోగులు ఉచితంగానే కోవిడ్ చికిత్స పొంది ఆరోగ్యవంతులవుతున్నారు.

సగం బెడ్లు ఆరోగ్యశ్రీ కేసులకు

కోవిడ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడమే గగనమవుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక వాటివైపే చూడలేకపోతున్న సామాన్య రోగుల దుస్థితిని గమనించిన జగన్ సర్కార్.. తాను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కోవిడ్ రోగులకు కూడా వర్తింపజేసింది. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులన్నింటిలో సగం బెడ్లను ఆరోగ్యశ్రీ కేసులకే కేటాయించాలని ఆదేశాలు జారీ చేసి పేద రోగుల నెత్తిన పాలు పోసింది. రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న అన్నిరకాల ఆస్పత్రుల్లో 48,439 బెడ్లు ఉన్నాయి. వాటిలో సగం అంటే 24,220 బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేటాయించారు.

నెలకు 72, 660 మందికి ఆరోగ్య లబ్ధి

రాష్ట్రంలో 108 ప్రభుత్వ, 349 కార్పొరేట్, 94 ప్రైవేట్, 47 తాత్కాలిక ఆస్పత్రులు కలిపి మొత్తం 598 ఉన్నాయి. వీటిలో 48439 పడకలను కోవిడ్ చికిత్సకు కేటాయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వీటిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీ కేసులకు.. మిగిలిన సగం నాన్ ఆరోగ్యశ్రీ కేసులకు కేటాయించారు. ఆరోగ్యశ్రీ కోవిడ్ కేసులకు అత్యుత్తమ చికిత్స, ఉచితంగా మందులు, పౌష్టికారం మిగిలిన కోవిడ్ రోగులతో సమానంగా అందిస్తున్నారు. కానీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఒక రోగికి సగటున ఆరు రోజుల చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యశ్రీ కింద చేరే రోగులకు మాత్రం సగటున పది రోజుల వరకు ఉంచి చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేస్తున్నారు. అంటే ఒక బెడ్డుపై నెలలో ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలా ఆరోగ్యశ్రీకి కేటాయించిన 24,220 బెడ్ల లెక్కప్రకారం.. నెలకు 72,660 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ఉచితంగా స్వస్థత చేకూరుస్తోందన్నమాట. ఈ లెక్కన సెకండ్ వేవ్ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు లక్షలకుపైగా సామాన్య కోవిడ్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స అందింది.

17 ఆస్పత్రుల్లో బ్లాక ఫంగస్ చికిత్స

కొద్దిరోజులుగా విజృంభిస్తున్న బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 17 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఈ చికిత్స అందిస్తారు. మొత్తాన్ని సీఎం జగన్ మానస పుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పేద కోవిడ్, బ్లాక్ ఫంగస్ రోగుల ఆర్థిక, శారీరక ఆరోగ్యానికి సంజీవనిలా మారింది.

Also Read : వ్యాక్సిన్‌ పాలసీపై పునరాలోచించండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి