iDreamPost
android-app
ios-app

వీడియో: ఆలయంలో చోరీ.. హుండీలో నగదు కొట్టేసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

వీడియో: ఆలయంలో చోరీ.. హుండీలో నగదు కొట్టేసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

భక్తులు గుడికి వెళ్తే భగవంతుడికి ముడుపులు చెల్లించుకోవడం, కానుకలు, నగదు హుండీలో వేయడం చేస్తారు. కానీ ఓ ప్రభుద్దుడు హుండీలోని డబ్బులనే కొట్టేసి తన దొంగబుద్దిని బయటపెట్టాడు. ఆలయానికి రక్షణ కల్పించాల్సిన ఓ ఆలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దొంగలు పడకుండా కాపాలా ఉండాల్సిన వ్యక్తి తానే దొంగగా మారి హుండీలోని నగదును కాజేశాడు. ఈ చోరీకి సంబంధించిన దృష్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నెట్టికంటి ఆంజనేయ స్వామిపై భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. దీంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆ ఆలయంలో హుండీలో నగదు చోరీకి గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే చోరీకి పాల్పడింది దేవస్థాన చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణారెడ్డి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీని ఇతరుల పేరుపై నిర్వహిస్తూ 20 సంవత్సరాలుగా ఆలయంలో పాగా వేసిన కృష్ణారెడ్డిపై ఇదివరకు అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆంజనేయ స్వామి ఆలయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి తెల్లవారుజామున ఆలయంలోనికి ప్రవేశించి హుండీలోని నగదును కాజేశాడు. ఎంచక్కా హుండీలో చేయిపెట్టి డబ్బును తీసుకుని తన ప్యాంటు జేబులో పెట్టుకుంటున్న దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు కృష్ణారెడ్డిని విధుల నుంచి తొలగించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తితో చెల్లించుకున్న ముడుపులు, కానుకలు ఇలా చోరీకి గురికావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.